ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
కొంతకాలం క్రితం పక్షవాతంతో బాధపడ్డ ఆయన కొంతకాలానికి కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం మొదలుపెట్టారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఈ వార్త తెలిసిన కొందరు సినీ ప్రముఖులు హాస్పిటల్ కి చేరుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్బుతంగా తీర్చిదిద్దిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. తన గురువు దాసరిలా ఫ్యామిలీ సినిమాలకే ఆయన ఓటు వేసేవారు. విభిన్నమైన క్యారక్టరైజేషన్స్ తో ఆయన సినిమాలు అందరినీ అలరించేవి.
‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయం జరిగింది. మధ్యతరగతి జీవితాలను .. అందులోని ఒడిదుడుకులను కథా వస్తువుగా ఎంచుకుని, ఆయన ప్రేక్షకులను మెప్పించారు. ఫాంటసీ చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. ‘అమ్మోరు’ .. ‘అరుంధతి’ సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.