ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు

తీవ్ర అస్వస్థతకు గురై హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చెందారు.కొంతకాలం క్రితం పక్షవాతంతో బాధపడ్డ ఆయన కొంతకాలానికి కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం మొదలుపెట్టారు. అయితే గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్బుతంగా తీర్చిదిద్దిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. తన గురువు దాసరిలా ఫ్యామిలీ సినిమాలకే ఆయన ఓటు వేసేవారు. విభిన్నమైన క్యారక్టరైజేషన్స్ తో ఆయన సినిమాలు అందరినీ అలరించేవి.

‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయం జరిగింది. మధ్యతరగతి జీవితాలను .. అందులోని ఒడిదుడుకులను కథా వస్తువుగా ఎంచుకుని, ఆయన ప్రేక్షకులను మెప్పించారు. ఫాంటసీ చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. ‘అమ్మోరు’ .. ‘అరుంధతి’ సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.