నన్నే వేధించబోయాడు, మిగతా వాళ్ల సంగతేం చెప్పను?

గత కొద్ది నెలలుగా మీటూ ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు ఒక్కొక్కరే వచ్చి మీడియా ముందు తమ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఆల్రెడీ ఇండస్ట్రీలో తల్లి,తండ్రులు ఉన్న స్టార్ కిడ్స్ కు ఈ సమస్య ఉండదనుకుంటారు. కానీ అలాంటిదేమీ లేదు. ఇలాంటివాటికి అవేమీ అడ్డు కాదని స్టార్ కిడ్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాటల వల్ల అర్దమవుతోంది. ఆమె రీసెంట్ గా తమిళ డబ్బింగ్ పందెం కోడి, సర్కార్ చిత్రాల ద్వారా విలన్ గా తెలుగు వారికి పరిచయం అయ్యింది.

వరలక్ష్మి మాట్లాడుతూ… మా నాన్నగారు శరత్‌కుమార్‌ అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా కూడా నన్ను వేధించడానికి ప్రయత్నించారు. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ యాంకర్‌ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా? అని అడిగాడు. మిగతా విషయాలంటే ఏమిటో అందరికీ తెలుసు. స్టార్‌ కిడ్‌ని అయిన నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మిగతా వారి పరిస్థితి ఏమిటి? అందుకే వెంటనే బయటకొచ్చేసి ఆ యాంకర్‌ అన్న మాటలు అందరికీ చెప్పాను.

హీరోయిన్లతో పర్సనల్‌గా మాట్లాడే విషయాలు ఏముంటాయి? వారేమీ కుటుంబసభ్యులు కాదు కదా! బయట మాట్లాడడానికి. ఈ వేధింపుల గురించి ఇంతగా అందరూ మొత్తుకుంటున్నా ఇవి ఎదరువుతూనే ఉన్నాయి. వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇవి ఆగవు అన్నారు.

అలాగే ..సినిమా రంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది కొత్తగా వచ్చిందనుకుంటున్నారా? లేకపోతే పాత తరం వారు కూడా దీని బాధితులే అంటారా?
పాతతరంలో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండే ఉంటుంది. అప్పటి పరిస్థితుల కారణంగా ఎవరూ బయటపడలేదేమో! అందుకే ఇది ఇంతలా విజృంభించింది. ఇప్పటి వారికి ధైర్యం ఎక్కువ కనుక బయటకొచ్చి నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పారు.