టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు సహా పలువురు దర్శక, నిర్మాతలు ఆ మధ్య తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఈ సమావేశం షూటింగ్ లకు సంబంధించి అనుమతులు విషయమై జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లు చేసుకోమని అనుమతిచ్చారు. కానీ ఇప్పటివరకూ ఏ స్టార్ హీరో సినిమా షూటింగ్ కూడా ప్రారంభించలేదు. కేవలం చిన్న సినిమాలు, సీరియళ్లు మాత్రమే షూటింగ్ చేసుకుంటున్నాయి. దీంతో పెద్ద హీరోలంతా వైరస్ కి భయపడి పూర్తిగా తగ్గే వరకూ షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
అయితే అసలు సంగతి అది కాదని..కేసీఆర్ ఆ భేటీలో పెద్దలు ఊహించని మెలిక పెట్టారని తాజాగా వెలుగులోకి వచ్చింది. 60 ఏళ్లు వయసు పై బడిన హీరోలెవరు షూటింగ్ లో పాల్గొనకూడదని స్ర్టిక్ట్ గా ఆదేశాలిచ్చారుట. ఎట్టిపరిస్థితుల్లో వయసు మీద పడిన వారు ఎవరూ షూటింగ్ హాజరైతే ఒప్పుకోమని గట్టిగానే చెప్పారుట. అందుకే చిరంజీవి, నాగార్జున తమ సినిమా షూటింగ్ లు చేయలేదని అంటున్నారు. ఈ భేటీకి వెళ్లిన చిరంజీవి వయసు 65, నాగార్జున వయసు 61 ఏళ్లు. కాబట్టి కేసీఆర్ లెక్క ప్రకారం ఈ హీరోలిద్దరు సినిమా షూటింగ్ లు చేయకూడదు. అయితే మహేష్ , రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ సహా 50 ఏళ్ల లోపు ఉన్న వారంతా యధావిధిగా షూటింగ్ చేసుకోవచ్చు.
కానీ వాళ్లు కూడా భయపడి షూటింగ్ చేయలేదు. అయితే ఈ అసలు విషయాన్ని భేటీకి హాజరైన పెద్దలెవరు ఛాంబర్ తరుపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పలేదు. పరిస్థితి ఎంత మాత్రం బాగోలేదు కాబట్టే చిరంజీవి ప్రస్తుతానికి షూటింగ్ లు ఆపేయడమే మంచిదని భావించే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మెగాస్టార్ నిర్ణయం సరైనిదే. స్టార్ హీరోల సినిమా షూటింగ్ లు మొదలైతే పెద్ద ఎత్తున క్రూ హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైరస్ ఒక్కరికి ఉన్న అందరికీ అంటుకుంటుంది. అదీ అందరికీ చేటు. మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడే కన్నా సోకకుండా జాగ్రత్త పడటం మంచిదే కదా.