ఏపీ- తెలంగాణలో థియేటర్లు తెరిస్తే లాభమా? నష్టమా? ఇదే ప్రశ్న ఇండస్ట్రీ టాప్ ఎగ్జిబిటర్ కం నిర్మాత డి.సురేష్ బాబుని ప్రశ్నిస్తే ఆయనేం చెబుతారో తెలుసా? ఇప్పటికే పలుమార్లు ఆయన థియేటర్లు మల్టీప్లెక్స్ థియేటర్లు ఓపెన్ చేస్తే నష్టమే కానీ లాభం ఉండదని వెల్లడించారు.
మరోసారి అదే విషయాన్ని కుండబద్ధలు కొట్టేశారు. ఇప్పుడే థియేటర్లు తెరిస్తే మనుగడ సాగించడమే కష్టం అవుతుంది. ఇప్పటికే ఎగ్జిబిషన్ రంగం తీవ్రంగా నష్టపోయింది. అయినా థియేటర్లు తెరవడం అంత సురక్షితం కాదని సురేష్ బాబు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చైనా, దుబాయ్ లో థియేటర్లు తెరిచారు. కానీ రెండు శాతం ఆక్యుపెన్సీతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. అందుకే ఇప్పుడే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవడం సురక్షితం కానే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జనం థియేటర్లకు రారు. మంచి కంటెంట్ ఉంటే ఓటీటీల్లో చూసేందుకే ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇక తాను ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్టు డి.సురేష్ బాబు వెల్లడించారు. ఎగ్జిబిషన్ రంగం తీవ్ర నష్టాల్లో ఉందని కూడా డి.సురేష్ బాబు వెల్లడించారు. థియేటర్లు తెరవక పోవడం వల్ల ప్రత్యక్ష పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి నివశిస్తున్న లక్ష మంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిన సంగతి విధితమే.