ధనవంతులకు సీసీసీ సరుకులెందుకు?
ప్రస్తుత కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) సినీకార్మికులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. మహమ్మారీ లాక్ డౌన్ అందరినీ ఇబ్బంది పెట్టింది. ఇటీవల షూటింగుల అనుమతుల కోసం మెగాస్టార్ కృషి చేసి సఫలమయ్యారు. అయితే కార్మికులకు కష్టకాలం కొనసాగుతోంది. ఇంకా ఉపాధి లేనందున సీసీసీ ద్వారా మరోసారి నిత్యావసరాల్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి అన్ని అసోసియేన్ల ద్వారా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
అయితే మొదటిసారి సీసీసీ తరపున సరుకులు పంచినప్పుడు అధికశాతం ధనవంతులే అందుకున్నారట. 13 వేల మందిలో నాలుగైదు నెలలు ఏ డోఖా లేకుండా బతికేయగలిగిన వాళ్లు ఎక్కువమంది ఉన్నారని తేలిందట. ఇదే విషయంపై ఎన్.శంకర్ ని పలువురు నిలదీశారని తెలిసింది. అందుకే ఈసారి కూడా అందరికీ పంపిణీ చేయాలని మెగాస్టార్ భావించినా.. కొందరికి చెక్ పెట్టేందుకు ఏరివేత కార్యక్రమం మొదలైందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే పాన్ కార్డ్- ఆధార్ కార్డ్ వివరాల్ని కలెక్ట్ చేస్తున్నారట.
తాజాగా దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ-“లాక్ డౌన్ అనంతరం ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు సీసీసీ ని ప్రారంభించారు. మొదటి దశలో దాదాపు 13 వేల మంది కార్మికులకు నిత్యావసరాలు అందించాం. తొలి దశలానే రెండో దశలోనూ మరోసారి కార్మికులకు నిత్యావసరాల్ని అందించనున్నాం. అయితే కొందరు ఆర్థిక ఇబ్బందులు లేనివారికి గతంలో పంపిణీ జరిగిందని, అలా కాకుండా పేదలకే సేవలు అందాలని కొందరు సూచించడంతో ఆ దిశగా ఆలోచించి పేదలకు సాయమందిస్తున్నాం. అయితే రెండో దశ పంపిణీలో అవసరార్థులు మాత్రమే నిత్యావసరాలు అందుకుంటారని కోరుకుంటున్నాం“ అని తెలిపారు. దీనిని బట్టి ఈసారి ఏరివేతలో దాదాపు సగం మంది ఎగిరిపోయే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు.