డేంజర్ జోన్‌లో క్రేజీ హీరో.. కులం ఉచ్చు!
కులం అనేది తెలుగు రాష్ట్రాల్లో.. టాలీవుడ్ లో ప్రధానమైన ఫ్యాక్టర్. దాని ఉచ్చులో పడకుండా ఇక్కడ మనుగడ సాగించడం దాదాపు అసాధ్యం. అయితే 85ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలో ప్రేక్షకులు ఎప్పుడూ తమ హీరో ఫలానా కులానికి చెందిన వాడు అని విడిగా చూడలేదు. అందుకే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ వంటి హీరోలు గొప్ప స్టార్లుగా ఎదిగారు. ఆ తర్వాతి జనరేషన్ లోనూ మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ సైతం కులానికి అతీతంగా అందరు ప్రేక్షకుల ఆదరణ పొందడం వల్లనే అంత గొప్ప స్టార్లుగా వెలిగారు. వీళ్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించడానికి కారణం కులం అనే ఫ్యాక్టర్ పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపకపోవడమే. అయితే టాలీవుడ్ లో కులం అన్నదే లేదా? అంటే అది ఎప్పుడూ ఉంది. అది ఇంటర్నల్ గా అణగిమణిగి ఉంది. ఫ్యాన్స్ లో దాని ప్రభావం ఉంది. కానీ సినిమా బావుంది అంటే అవన్నీ దూరంగా పోయాయి. కులానికి అతీతంగా సినిమా బిజినెస్ కూడా సాగుతోంది.
అయితే ఇటీవలి కాలంలో సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వస్తుండడంతో మరోసారి కులం అన్నది అత్యంత ప్రమాదకరంగా పడగ విప్పింది. కులాలవారీగా అభిమానులు సపరేట్ అయ్యారు. మెగా ఫ్యామిలీ అభిమానులు ఒక కులం.. నందమూరి ఫ్యామిలీ అభిమానులు అంటే వేరే కులం ఇలా విడివిడిగానే చూడాల్సిన దరిద్రం దాపురించింది. ఇక ఈ కులం రొంపిలోకి నైజాంకి చెందిన ఓ యంగ్ రైజింగ్ హీరో పేరు కూడా చేరడంపై మీడియాలో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. సదరు యంగ్ హీరో ముఖ్యమంత్రి కులం. అందువల్ల అతడికి నైజాంలో పెద్ద అండ లభిస్తోంది. ఇక్కడ ఏకంగా సీఎం కొడుకు అంతటి వాడే తనకు జోలె పడుతున్నాడు. తన కెరీర్ పెద్ద స్థాయికి ఎదిగేందుకు సాయపడుతున్నారని ప్రచారం అవుతోంది. ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో తన ఓటు ఫలానా పార్టీకే.. ఫలానా నాయకుడికే అంటూ సదరు హీరో ఓపెన్ గా ప్రకటించడంతో అప్పటి నుంచి కులపిచ్చి హీరో అన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఈ కులం ఫ్యాక్టర్ సదరు హీరో కెరీర్ పై ఏమేరకు ప్రభావం చూపనుంది? అన్న విశ్లేషణ మొదలైంది. ఇప్పటికైతే ఆ ప్రభావం లేదు. కానీ మునుముందు దాని ప్రభావం కనిపించే వీలుందని అంటున్నారు. ఇప్పటికే తన చుట్టూ ఉన్న కోటరి అతడిని రాంగ్ రూట్లో వెళ్లేలా చేస్తోంది. దానికి తోడు సదరు యంగ్ హీరో యాటిట్యూడ్ గురించి ఎక్కువగా డిస్కషన్ సాగుతోంది. అయితే కులం విషయంలో విద్యాధికుడైన సదరు హీరో యాటిట్యూడ్ చూపించకుండా అందరినీ కలుపుకుని వెళితే ఎలాంటి సమస్యా ఉండదు. ఒకవేళ దానిని బహిరంగంగానే చూపించాలనుకుంటే సమస్య తప్పదు. ఇప్పటివరకూ ఇండస్ట్రీలో ఏ హీరోకి కులం వల్ల సమస్య రాలేదు. అన్ని కులాల ప్రజలు ఆదరించారు. అభిమానించారు. అలా కాకుండా ఏ ఒక్క కులమో ఆదరిస్తే.. తమ కులం మాత్రమే థియేటర్లకు వస్తే ఇక ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించగలం. కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ..