టాలీవుడ్ పెద్ద‌లూ.. మే 29 వ‌ర‌కూ కాస్త ఆగండి!

tollywood

క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ‌లు అన్నీ మూత ప‌డిన సంగ‌తి తెలిసిందే. షూటింగులు లేక అల్లాడే ప‌రిస్థితి. రిలీజ్ లు లేక ఆదాయం జీరో అయిపోయిన ధైన్యం నెల‌కొంది. ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌భుత్వాలు నానా తంటాలు ప‌డుతున్నాయి. ఇటీవలే కేరళ, తమిళనాడు సహా కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చిత్రనిర్మాతలకు పోస్ట్ ప్రొడక్ష‌న్ (నిర్మాణానంతర) ప‌నుల‌ను తిరిగి కొన‌సాగించ‌డానికి అనుమతి ఇచ్చాయి. ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విఎఫ్ఎక్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించాలని ఆశించిన చాలా మంది టాలీవుడ్ చిత్రనిర్మాతలకు ఇది కొత్త ఆశను రేకెత్తించింది.

అయితే మే 29 వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయవద్దని తెలంగాణ‌ ప్రభుత్వం మూడు టిఎస్‌ఎఫ్‌డిసికి సమాచారం. ఆ మేర‌కు ఇంకా తొంద‌ర ప‌డొద్ద‌ని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఎఫ్‌డిసి) చైర్మన్ రామ్ మోహన్ రావు సినీ పెద్ద‌లకు తాజాగా స‌మాచారం అందించారు. అయితే సిఎం కెసిఆర్ తన ఆలోచ‌న‌ను మార్చుకుంటార‌ని టాలీవుడ్ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మే 15 న తన సమీక్ష సమావేశం తరువాత నిర్ణయం వెలువ‌డుతుంద‌ని ఆశిస్తున్నారు.

లాక్ డౌన్ ఇప్ప‌టికే రోజువారీ వేతన సినీ కార్మికులను నిరుద్యోగులుగా మార్చింది. చాలా మంది ఊళ్ల‌కు వెళ్లిపోయారు. వాళ్లు తిరిగి వ‌స్తారా? అన్న‌ది సందేహ‌మే. ఇలాంటి క్లిష్ఠ ద‌శ‌లో వివిధ దశలలో అధిక సంఖ్యలో షూటింగులు నిలిచిపోయాయి. భారీ బడ్జెట్లు చిత్రాలు మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. ఇవ‌న్నీ పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే ప్ర‌భుత్వాల నుంచి వెసులుబాటు చాలా అత్యావ‌శ్య‌కం. మ‌రి తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.