ప్రముఖ దర్శకుడు తేజ డైరక్షన్ లో వచ్చిన చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ సినీగేయ రచయిత కులశేఖర్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన ఆ మధ్యన ఓ దొంగతనం కేసులో పట్టుబడి జైలుపాలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి దొంగతనం కేసులో పోలీస్ లకు దొరికారు.
బంజారాహిల్స్ రోడ్ నం బర్ 2 లోని ఇందిరానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజారి బ్యాగ్ దొంగతనానికి గురవ్వగా, పోలీసులు నిఘా వేసి సీసీ కెమెరా ఫుటేజీలు, కదలికల ఆధారం గా కులశేఖర్‌ను పట్టుకున్నారు. నిందితు డి నుంచి రూ.50 వేల విలువ చేసే పది సెల్‌ఫోన్లు, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కులశేఖర్‌ను బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొంతకాలంగా సినీ పరిశ్రమలో ఆఫర్స్ రాకపోవడం, జీవించటానికి వేరే మార్గం లేకపోవటంతో బతుకుదెరువు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంవల్లే ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది.
మానసిక స్దితి సరిగా లేకా?
విశాఖపట్నానికి చెందిన కులశేఖర్ హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసముంటూ చాలా సినిమాలకు పాటలు రాశాడు. సంతోషం, ఘర్షణ, ప్రేమలేఖ, ఫ్యామిలీ సర్కస్, చిత్రం, జయం, వసంతం, మృగరాజు, ఇంద్ర తదితర వంద సినిమాలకు పాటలు రాశాడు. ఆయన రాసిన పాటల్లో సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి.
ఆ తర్వాత ఆయన ‘ప్రేమలేఖరాశా’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం చాలాకాలం పాటు రిలీజ్ కు నోచుకోలేదు. ఆ సమయంలోనే కులశేఖర్ మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి.