కేసీఆర్ సారూ గుడిసెలైనా కట్టించండి ప్లీజ్!
కరోనా మహమ్మారీ విలయం ఫిలింనగర్ కృష్ణానగర్ కార్మికుల్ని గడగడలాడిస్తోంది. సినిమా రంగం అంటేనే అసంఘటిత రంగం. రెక్కాడితే కానీ డొక్కాడని రంగం. బతుకు తెరువుకు ఏమాత్రం బీమా లేని రంగం కూడా ఇదే. తిండికి టికాణా కొడుతూనే రోజూ పని చేయాలి. ఏరోజుకారోజు పని వెతుక్కోవాలి. అలా ఎందరో జూనియర్ ఆర్టిస్టులు సహా 24 శాఖల్లో పని చేసే కార్మికులు వేలల్లోనే ఉన్నారు. అధికారికంగా అసోసియేషన్ల ద్వారా పని చేసేవాళ్లను వదిలేస్తే అనధికారిక వర్కర్లే ఈ రంగంలో ఎక్కువ. వీళ్లంతా యూసఫ్ గూడ నుంచి అటు ఫిలింనగర్ వెళ్లే వరకూ గల్లీ గల్లీలో ఇంతకుముందు టీకొట్ల దగ్గర ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు వీళ్లంతా ఏమయ్యారో అర్థం కాని గందరగోళం కనిపిస్తోంది.
ప్రస్తుతం పనుల్లేక షూటింగుల్లేక నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక జూనియర్ ఆర్టిస్టుల సంఘంలో వందలాది మంది ఇంటి అద్దె కట్టలేక.. తిండికి లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ వార్తా చానెల్ స్పెషల్ స్టోరీలో జూనియర్ ఆర్టిస్టుల ఇక్కట్లను వాస్తవ పరిస్థితిని యథాతథంగా చూపించారు. నిజంగానే కడుపు తరుక్కుపోయేంత భయానక పరిస్థితి ఉందని హృదయం ద్రవింపజేసేలా అద్భుతమైన స్టోరీనే వేసింది ఆ చానెల్.
“తిండికే తికాణా లేదు. అద్దె కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రెంటు కట్టకపోతే యజమానులు బయటికి తరిమేస్తామని బెదిరిస్తున్నారు. అయ్యా కేసీఆర్ సారూ? మాకు ఉండటానికి కనీసం గుడిసెలు అయినా కట్టించరా?. బతుకు చివరిలో ఉన్నాం“ అంటూ ఓ 60 వయసు ఉన్న జూనియర్ ఆర్టిస్టు రోధించిన తీరుకు ఎవరికైనా గుండె కరగాల్సిందే. అద్దెలు వసూలు చేయొద్దని కేసీఆర్ ప్రభుత్వం హుకుం జారీ చేసినా ఇంటి యజమానులే ఆదాయం జీరోకి పడిపోయి జీవనోపాధి కోల్పోయి దారుణ స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరేం చెప్పినా వసూళ్లు తప్పడం లేదు.
ఇక సదరు జూనియర్ ఆర్టిస్టుతో పాటు ఎందరో రోడ్లు ఎక్కి తమకు కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలని నినదించడం అధినాయకులకు కనిపించిందో లేదో!! ఇంతకుముందు చిత్రపురి కాలనీ పరిసరాల్లోని ప్రభుత్వ భూమిలో ఇండ్లు లేని సినీకార్మికుల కోసం అపార్ట్ మెంట్లు కట్టించి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. కానీ ఎన్నికల తర్వాత దాని గురించి కనీస మాత్రంగా అయినా ప్రస్థావన లేదు. వాస్తవం పరిశీలిస్తే అసలు సినిమా వాళ్లు అంటేనే కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద కంపరం. టాలీవుడ్ హైదరాబాద్ నుంచి తరలి పోకూడదనే కుయుక్తితో ఆపారు తప్ప వీళ్లకోసం ఏదైనా చేయాలన్న ఆలోచన నిజాయితీగా లేదన్నది అక్షర సత్యం అని పలువురు సినీకార్మికులు వాపోవడం చూస్తుంటే పరిస్థితి ఎంత ధైన్యంగా ఉందో ఊహించవచ్చు. మంత్రి వర్యుల సరుకులు పేరుతో 10 కేజీల కవర్లు పంచిన సినిమాటోగ్రఫీ మంత్రి ఆ తర్వాత మళ్లీ కనిపించనే లేదు. ఇక ఇప్పట్లో వీళ్లకు గూడు దొరకడం కష్టమేనని అర్థమవుతోంది.