20 మంది టాలీవుడ్ `బందోబస్త్` ఎందుకు?!
సూర్య హీరోగా నటిస్తున్న తమిళ సినిమా `కాప్పాన్` తెలుగులో `బందోబస్త్` పేరుతో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సూర్య – కె.వి. ఆనంద్ (బ్రదర్స్ ఫేం) కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే టైటిల్ లోగో.. సూర్య లుక్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే బందోబస్త్ టీజర్.. ట్రైలర్ ఇదివరకూ రిలీజై ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా తమిళ వెర్షన్ ఆడియో ఈవెంట్ ని చెన్నయ్ లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించి సన్ నెట్ వర్క్ ఎక్స్ క్లూజివ్ గా రిజర్వ్ చేసుకోవడంతో అస్సలు దీనికి సంబంధించిన విజువల్స్ ఏవీ ఆన్ లైన్ లో రివీల్ కాలేదు. ఆదివారం సాయంత్రం చెన్నయ్ లో జరిగిన ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీజర్నలిస్టుల్ని లైకా సంస్థ ఆహ్వానించింది. నిన్నటి ఉదయం 7 గంటలకు శంషాబాద్ నుంచి చెన్నయ్ కి 20 మంది జర్నలిస్టులు బయల్దేరారు.
చెన్నయ్ వెళ్లిన తెలుగు జర్నలిస్టుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ వైరముత్తు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ సినిమా సూర్య కెరీర్ లో ఎంతో ఇంపార్టెంట్. విజువల్స్ ఆకట్టుకున్నాయన్న రిపోర్ట్ అందింది. రజనీకాంత్- శంకర్ కాంబో చిత్రాలు రోబో.. 2.0 చిత్రాల ప్రమోషన్స్ కోసం ఇదివరకూ తెలుగు జర్నలిస్టుల్ని చెన్నయ్ కి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అంతే గ్రాండ్ గా బందోబస్త్ కోసం తెలుగు జర్నలిస్టుల్ని ఆహ్వానించడం విశేషం. లైకా సంస్థ ప్రతిసారీ తెలుగు జర్నలిస్టులకు ఈ ఆఫర్ ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఈవెంట్ కోసం ఒక్కో జర్నలిస్టుకు రాను పోను విమానం ఖర్చులు- స్టార్ హోటల్ బస ఏర్పాటు వగైరా సుమారు రూ.10 వేలు ఖర్చు చేస్తోందట. అంటే మొత్తంగా 3-5లక్షల మేర తెలుగు జర్నలిస్టులపై ఖర్చు చేస్తున్నారన్నమాట. చెన్నయ్ కి వెళ్లిన 20 మంది తెలుగు సినీజర్నలిస్టులు నేటి ఉదయం 10 గంటలకు అట్నుంచి బయల్దేరుతున్నారు. 12 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నాని తెలుస్తోంది. చెన్నయ్ లో లైవ్ ఈవెంట్ నుంచి బంద్ బస్త్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే రివీలయ్యాయి.