కరోనా వైరస్ భారత్ కి…తెలుగు రాష్ర్టాల్లోకి వచ్చిన కొత్తలో టాలీవుడ్ సెలబ్రిటీలంతా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అవేర్ నేస్ కార్యక్రమంలో భాగంగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్ , మహేష్ బాబు సహా అంతా కరోనాని జయిద్దామని అవేర్ నెస్ కార్యక్రమాలు చేసారు. చాలా మంది టీవీ ఆర్టిస్టులు సైతం కాన్సెప్ట్ వీడియోలు కూడా రిలీజ్ చేసారు. బాలీవుడ్ నటులతో కలిసి చిరంజీవి, నాగార్జున సహా పలువురు స్టార్లు అంతకు ముందు ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసారు. ఇక వైరస్ ముదిరి లాక్ డౌన్లు ప్రకటించిన తర్వాత చిరంజీవి సీసీసీ పేరిట ఛారిటీని ఏర్పాటు చేసి సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు.
ప్రస్తుతం లాక్ డౌన్ లేని నేపథ్యంలో ఆ సేవలకు బ్రేక్ పడింది. అయితే మహమ్మారి విజృంభణ ఇప్పుడు అంతకంతకు విస్తరిస్తోంది. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితులేర్పడుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో పడిన ఇబ్బందులనే ఇంకా ఎదుర్కుంటున్నారు. సినిమా షూటింగ్ లు పూర్త స్థాయిలో మొదలు కాలేదు. చిన్న సినిమాలు తప్ప స్టార్ హీరోల సినిమాలేవి సెట్స్ కు వెళ్లలేదు. కొంత మంది ప్రత్నామ్యాయంగా వేరే పనులు చూసుకుంటున్నారు. అయినా సినిమా తప్ప మరో పని తెలియని వారంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రస్తుత పరిస్థితులు దేనిపైనా సెలబ్రిటీలు స్పందించలేదు.
కరోనా ఉగ్ర రూపం దాల్చి సిటీ ఖాళీ అయిపోతున్నా…పనులు లేక ఇబ్బంది పడుతోన్న…ప్రభుత్వం కరోనా ని కట్టడి చేయడంలో విఫలమై విమర్శలెదుర్కుంటున్నా ఎవరూ స్పందిచకపోవడం విశేషం. అవన్నీ పక్కనబెట్టి వైరస్ ఉగ్రరూపం దాల్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏ ఒక్క సెలబ్రిటీ కూడా ఇప్పుడు చెప్పకపోవడం మరో ఆసక్తికర విషయం. ప్రస్తుతం సెలబ్రిటీలంతా తెలంగాణ రాష్ర్టానికి చెందిన రాజ్యసభ సభ్యుడు, సీఎం కేసీఆర్ మేనల్లుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బిజీగా ఉన్నారు. కరోనాని పక్కనబెట్టి అంతా మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో సంతోష్ కుమార్ ఇలా సెలబ్రిటీలను డైవర్ట్ చేస్తున్నారా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.