మనసు మార్చుకున్న టాప్ స్టార్స్
కరోనా మహమ్మారీ అంతకంతకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మెట్రోలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న రిపోర్ట్ ఉంది. రోజుకు 900 కేసులు నమోదవుతున్నాయంటే సీన్ ఎలా ఉందో ఊహించవచ్చు. కరోనాని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో టాలీవుడ్ షూటింగులు సాధ్యమేనా? అంటే.. అసాధ్యం అన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఇండస్ట్రీ బడా స్టార్లు ఎవరూ షూటింగులకు వెళ్లేందుకు ఎంతమాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది.
సీనియర్లు.. జూనియర్లు అనే తేడా ఏం లేదు. ఎవరూ సెట్స్ కెళ్లేందుకు ఆసక్తిగా లేరు. మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేష్.. బాలకృష్ణ.. నాగార్జున.. మహేష్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. ప్రభాస్.. అందరిదీ ఒకటే ఆలోచన. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ తారలందరూ మరో నెల లేదా రెండు నెలలు ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏమాత్రం రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
హైదరాబాద్ లో కరోనా కేసులు గత వారం నుండి రోజుకు 500 నుండి 900 వరకు పెరిగాయి. ఈ కేసుల్లో 90 శాతం హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఉన్నాయి. ఈ పరిణామం ఊహించనిది. అందుకే గత నెల వరకు షూటింగుల్ని తిరిగి ప్రారంభించడానికి చాలా ఆసక్తిగా ఉన్న అగ్ర తారలు తమ మనసు మార్చుకున్నారు.
ఈ వారం చివర్లో టెస్ట్ షూట్ ప్రారంభమవుతుందని భావిస్తున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ బృందం సహా… మరో రెండు నెలల పాటు మరో పెద్ద స్టార్లు ఎవరూ సెట్స్ కెళ్లే వుద్ధేశంతో లేరట. కొన్ని సినిమాలు ఆగస్టు రెండవ భాగంలో ప్రారంభమవుతాయి కాని చాలా వరకు సెప్టెంబర్ నుండి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, బాలకృష్ణ ‘బిబి 3’, వెంకటేష్ – నారప్ప, నాని ‘టక్ జగదీష్’ , విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ ఇవన్నీ తదుపరి షెడ్యూల్ ని తిరిగి ప్రారంభించాల్సిన కొన్ని ప్రధాన చిత్రాలు. కానీ వీళ్లెవరూ ఇప్పుడే ప్రారంభించే యోచనలో లేరని తెలిసింది. అలాగే మహేష్ బాబు .. అల్లు అర్జున్ తమ కొత్త చిత్రాల షూటింగులపైనా ఆచి తూచి అడుగులేస్తున్నారట. ‘సర్కారు వారి పాట’ ‘పుష్ప’ చిత్రీకరణలు సాగకపోయినా సెట్స్ డిజైన్ చేస్తున్నారని తెలిసింది.