వెండితెర వెనుక “శివరంజని” జయసుధ

సినిమారంగంలో పడి లేచే కడలి తరంగాల్లా  తారల బ్రతుకులు ఉంటాయి అంటారు. ఈ మాటలు అక్షర సత్యం అని చెప్పవచ్చు.

గ్లామర్ సినిమా ప్రపంచంలో అమాయకంగా ప్రవేశించిన ఎందరో నటీమణులు గ్రామర్ తేలికగా మాయలో పడిపోతారు, మరికొంత మంది అయినా వాళ్ళ మోసంతో బయటకు వచ్చి తీయని మత్తులో ఇరుక్కుంటారు. దాన్నుంచి బయట పడే టప్పటికే … ఆలస్యమవుతుంది. తెలియని సమస్యల వలయంలో చిక్కుకుంటారు. జీవితం కొందరికి మాధుర్యాన్ని పంచితే మరి కొందరికి చేదు  జ్ఞాపకాలనే మిగుల్చుతుంది.

జయసుధ. తెర మీద  అద్భుతమైన నటి. ఎన్నో విషాద పాత్రలను అద్వితీయంగా పోషించింది. ఆ పాత్రల విషాదం ఆమె జీవితం మీద కూడా తెలియకుండా పడింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. 17 డిసెంబర్ 1958లో మద్రాస్ లో జన్మించింది.

జయసుధ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ….. ఆమె జీవితంలో అనుకోని ఘటనలు …. మీకోసం !

మద్రాస్ లో పుట్టి పెరిగిన జయసుధ అసలు పేరు సుజాత. శ్రీమతి విజయ నిర్మలకు దూరపు చుట్టం అవుతుంది. ఆమె ప్రోత్సాహంతోనే 1972లో ” పండంటి కాపురం ” చిత్రంలో నటించింది. అప్పటికి జయసుధకు 12 సంవత్సరాలు. ఆ తరువాత రెండు సంవత్సరాల గ్యాప్ అనంతరం “తిరుపతి” సినిమాలో దాసరి నారాయణ రావు అవకాశం ఇచ్చాడు.  మరో ఐదు సినిమాల్లో నటించినా జయసుధకు చెప్పుకోతగ్గ పేరు రాలేదు. 1976లో రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన “జ్యోతి ;సినిమా జయసుధకు స్టార్ డం తెచ్చి పెట్టింది.

అక్కడ నుంచి ఆమె వెనక్కు తిరిగి చూడలేదు. అనేక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. స్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లోనే వడ్డే రమేష్ చుట్టం రాజేంద్ర ప్రసాదుతో ప్రేమలో పడింది. అయితే ఈ వివాహాన్ని ఆమె తల్లి జోగా భాయ్ ఒప్పుకోలేదు . అయినా జయసుధ రాజేంద్ర ప్రసాద్ ను చేసుకోవడానికి ఇష్టపడింది. వారిద్దరి వివాహం విజయవాడలో జరిగింది. ఇద్దరు హైద్రాబాద్లో కాపురం పెట్టారు. అయితే వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. రెండు సంవత్సరాల తరువాత రాజేంద్ర ప్రసాద్ కు విడాకులు ఇచ్చి హిందీ నటుడు జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్ ను 1985లో వివాహం చేసుకుంది.

నితిన్ కపూర్ అప్పుడు దాసరి నారాయణ రావు దగ్గర అసోసియేట్ గా పనిచేసేవాడు. వీరి వివాహం అయిన తరువాత 1986లో “ఆది దంపతులు” అనే సినిమా నిర్మాణం మొదలు పెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణ రావు. దంపతులిద్దరికీ దాసరి సన్నిహితుడు.

ఆతరువాత ఆది దంపతులు, కలికాలం,  అదృష్టం, మేరా  పతి సిరప్ మేరా హై, వింత కోడళ్ళు చిత్రాల తరువాత శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో నిర్మించిన “హాండ్స్ అప్ ” చిత్రం జయసుధను ఆర్ధికంగా బాగా నష్ట పరిచింది. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా జయసుధను పూర్తిగా అప్పుల పాలు చేసింది.

అదే సమయంలో జయసుధ అప్పటి ముఖ్య మంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహితమైంది. జయసుధ యేసు ప్రభువును నమ్ముతుంది. అందుకే తరచూ  జయసుధ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మతో ప్రార్ధనలో పాల్గొనేది. అలా రాజశేఖర్ రెడ్డి ప్రేరణతో కాంగ్రెస్ పార్టీలో చేరింది.

ఆమెను అప్పులబారి నుంచి రాజశేఖర్ రెడ్డి బయట పడేచాడని  చెప్పుకుంటారు. 2009లో జయసుధ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున శాసన సభకు పోటీ చేసి ఎన్నికయ్యింది. రాజశేఖర్ రెడ్డి  మృతి ఆమెను బాగా కలచివేసిందని అంటారు. .

2014 తరువాత మళ్ళీ రాజకీయాలపై ద్రుష్టి పెట్టలేదు. సినిమా నటిగా కొనసాగుతూ వుంది. 2015లో కొడుకు శ్రేయాన్ హీరోగా నిర్మించిన “బస్తీ” సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ మానసిక వ్యధలోనే నితిన్ కపూర్ 2017లో ముంబై లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో జయసుధ నివ్వెర పోయింది. అయినా కన్న బిడ్డల కోసం అన్నీ దిగమింగుకొని నటిగా ప్రస్థానం కొనసాగిస్తుంది.

జయసుధ కు కల్లాకపటం  తెలియదని అంటారు. నటిగా ఎంత ప్రతిభావంతురాలో  వ్యక్తిగా అంత సున్నిత మనస్కురాలు. అందుకే తనకు ఎదురయ్యే సమస్యలను అధిగమించలేక పోతుంది. జీవితంలో నేర్చుకున్న గుణపాఠాలు ఆమెను కృంగదీసినా, దీరగా ముందుకు సాగుతుంది.

-భగీరథ