జాను వ‌ర్సెస్ జాన్.. ఏమిటీ టైటిల్ క‌న్ఫ్యూజ‌న్!

ఒకేలా సౌండింగ్ ఉన్న రెండు టైటిల్స్ తో ఒకేసారి సినిమాలు తెర‌కెక్కుతుంటే ఆ క‌న్ఫ్యూజ‌న్ మామూలుగా ఉండ‌దు. అలాంటి ఇబ్బందే ఇప్పుడు ప్ర‌భాస్ టీమ్ .. శ‌ర్వానంద్ టీమ్ ఎదుర్కొంటున్నారు. ఒక‌రి టైటిల్ జాన్ అని వినిపిస్తుంటే.. ఇంకొక‌రి టైటిల్ ని జాను అని ప్ర‌క‌టించేయ‌డ‌మే ఈ క‌న్ఫ్యూజ‌న్ కి కార‌ణ‌మైంది. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 96 ని తెలుగులో శ‌ర్వానంద్, స‌మంత జంటగా మాతృక ద‌ర్శ‌కుడు సి. ప్రేమ్ కుమార్ నిర్ధేశ‌నంలో దిల్ రాజు నిర్మిస్తుస్తున్నారు. ఇటీవ‌లే జాను అంటూ టైటిల్ ని ప్ర‌క‌టించ‌డంతో అస‌లు క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది.

ఇలాంటి టైటిల్ ని ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌భాస్ – యువి క్రియేష‌న్స్ బృందం గెస్ చేయ‌క‌పోవ‌డంతోనే వ‌చ్చింది చిక్కు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ 20 కి జాన్ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. దీంతో ఇప్పుడు ఈ టైటిల్ ని మార్చాల్సి ఉంటుందా? అన్న త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంద‌ట‌. ఇప్ప‌టికే దిల్ రాజు బృందం రీమేక్ కి జాను అని టైటిల్ ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి ప్ర‌భాస్ బృంద‌మే క్లారిటీతో వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఉన్న‌ట్టుండి త‌న స్నేహితులే అయిన ప్ర‌భాస్- యూవీకి దిల్ రాజు ఎందుక‌లా ఝ‌ల‌క్ ఇచ్చారు? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. టైటిల్ క్లాష్ విష‌య‌మై ఆ ఇరు వ‌ర్గాలు ముందే చ‌ర్చించుకోలేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.