కరోనా కల్లోలం పరిశ్రమల పుట్టి ముంచడమే కాదు.. బ్రహ్మచారుల పుట్టి కూడా ముంచింది. ముఖ్యంగా ఎంతో కాలం వెయిట్ చేసి ఎలాగైనా ఈసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్న హీరోలంతా కరోనా విజృంభణ వల్ల వాయిదాలతో కాలయాపన చేయాల్సి వస్తోంది. పెళ్లి చేసుకుని హనీమూన్ అంటూ సరదాగా ఎంజాయ్ చేయాల్సిన ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారీ దయలేకుండా వెంటాడుతూనే ఉంది. కరోనా లాక్ డౌన్ వల్ల రెండు నెలల సమయం అనవసరంగా వృధా అయిపోయింది. ముందే నిశ్చయించిన ముహూర్తాలు దాటి పోయాయి. కనీసం కొత్త ముహూర్తం పెట్టుకోవాలనుకున్నా లాక్ డౌన్ నుంచి ఉపశమనం కనిపించడం లేదు.
అందుకే ముందుగా మన హీరోల్లో నిఖిల్ తేరుకున్నాడు. డా.పల్లవి వర్మతో తన పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మే 14న కానిచ్చేయాలనుకున్నా ఇంకా లాక్ డౌన్ తీసేయలేదు. దీంతో పెళ్లి వ్యవహారం సందిగ్ధంలో పడింది. ఈనెల 17 వరకు లాక్ డౌన్ ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ ముహూర్తాన్ని వదులుకోవాలా వద్దా? అన్న సందిగ్ధత కొనసాగుతుంది. అయితే తాజా సన్నివేశం చూస్తుంటే ముహూర్తం మిస్ చేసుకోవడం సరికాదని నిఖిల్ కుటుంబ పెద్దలు భావిస్తున్నారట. అంటే ముందే నిశ్చయించిన మే 14 ఉదయం 6:31 గంటల సుముహూర్తానికే కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లాడేయనున్నాడట. అయితే ఇన్నాళ్లు లేనిది ఉన్నట్టుండి ఇలా మారాడేమిటి? అంటే.. మొన్న ఉన్నట్టుండి నిర్మాత దిల్ రాజు ఇచ్చిన షాక్ తెలిసిందేగా. సైలెంటుగా ఆయన రెండో వివాహం కొద్దిమంది బంధుమిత్రుల మధ్య కానిచ్చేశారు. అలానే నిఖిల్ కూడా ఇప్పుడు కొద్దిమంది బంధుమిత్రుల మధ్య పెళ్లాడేయాలని నిర్ణయించుకున్నాట.
ఇకపోతే మరో బ్యాచిలర్ నితిన్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. హైదరాబాద్ ని కరోనా ఇప్పట్లో వదిలేట్టు లేదు. ఆ క్రమంలోనే నితిన్ తన పెళ్లిని వాయిదా వేయకుండా ఏదో ఒక క్లారిటీనిస్తాడనే భావిస్తున్నారు. మరోవైపు యువహీరో రానా మాత్రం లాక్ డౌన్ ని పూర్తిగా ఎత్తేశామని ప్రభుత్వాల నుంచి క్లారిటీ వచ్చేస్తే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాడని తెలుస్తోంది. హైదరాబాద్ మూలాలున్న ముంబై డిజైనర్ మిహికా బజాజ్ ని పెళ్లాడుతున్న సంగతి తెలిసిదే. ఇలా మన హీరోలంతా పెళ్లి సంగతిపై పూర్తిగా క్లారిటీగానే ఉన్నారని అర్థమవుతోంది. వీళ్లతో పాటు ఈ లాక్ డౌన్ తీరిక సమయంలో డార్లింగ్ ప్రభాస్ కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తే ఇంకా బావుంటుందేమోననేది అభిమానుల మాట. మరి డార్లింగ్ ఏమంటాడో?