అమెరికాలో AMC థియేటర్లు ఇప్పట్లో తెరవరు
కరోనా మహమ్మారీ అగ్రరాజ్యం అమెరికాని అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా- బ్రిటన్ లోనూ విలయతాండవమాడుతోంది. ఆ క్రమంలోనే సినీపరిశ్రమలు అల్లాడిపోతున్నాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సన్నివేశం కనిపించడం లేదు. మొండివాడైన ట్రంప్ అమెరికాలో ప్రతిదీ యథాస్థితిని తెస్తానని ప్రకటించి చాలాకాలమే అయినా ఊహించని రీతిలో కరోనా విజృంభించడంతో అక్కడ ఏదీ తోచని పరిస్థితి నెలకొంది.
ఆ క్రమంలోనే అమెరికాలో ప్రఖ్యాత థియేటర్ చైన్ అయిన ఏఎంసీ పలుమార్లు థియేటర్లు తెరిచే ఆలోచనను విరమించింది. తాజాగా మరోసారి ఆగస్టు చివరి వరకూ కార్యకలాపాల్ని కొనసాగంచలేమని బహిరంగ ప్రకటన వెలువరించింది. తాజా పరిణామంతో రిలీజ్ లకు రెడీ అవుతున్న ములన్, టెనెట్ (క్రిస్టోఫర్ నోలాన్) సినిమాల్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అలాగే బ్రిటన్ కి చెందిన UK సినీవరల్డ్ గ్రూప్ PLC (CINE.L) అమెరికా కార్యకలాపాల్ని ఆగస్ట్ మిడిల్ వరకూ వాయిదా వేసుకుంది. నెలాఖరు నాటికి బ్రిటన్ లో చలనచిత్ర దర్శకులను తిరిగి స్వాగతించే ఆలోచన చేస్తున్నా థియేటర్లను తెరిచే విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని పరిమితం చేయడానికి అనేక దేశాలు లాక్డౌన్లు.. సామాజిక దూర చర్యలను విధించిన సంగతి విధితమే. మార్చి చివరి వారం నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసివేశారు. ప్రపంచంలోని అతిపెద్ద సినిమా థియేటర్ ఆపరేటర్ అయిన AMC, జూలై 30 వరకు తిరిగి తెరవలేమని ప్రకటించినా.. ఆ తర్వాతా దానిని కొనసాగించింది. యునైటెడ్ స్టేట్స్ లో రీగల్ సినిమాస్ పరిస్థితి ఇదే. యుఎస్ – యుకె రెండు చోట్లా తిరిగి తెరిచే తేదీని జూలై 31 వరకు పొడిగించినా ఇప్పటికీ పరిస్థితి మెరుగవ్వకపోవడంతో అదే కొనసాగుతోంది.
అయితే ఐరోపా మధ్యప్రాచ్యంలోని అన్ని AMC సినిమాస్ లో మూడింట ఒకవంతు ఇప్పటికే తెరిచి ఉన్నాయి. సాధారణంగా పనిచేస్తున్నాయని AMC తెలిపింది. ఈ వారం ప్రారంభంలో వార్నర్ బ్రదర్స్ టెనెట్ రిలీజ్ కావాల్సి ఉండగా.. మరోసారి వాయిదా పడింది. తాజా పరిస్థితుల వల్ల ఏఎంసీ థియేటర్లను వేరొక కార్పొరెట్ దిగ్గజం చేజిక్కించుకోబోతోందని విస్త్రతంగా ప్రచారం సాగుతోంది. అమెజాన్ వాళ్లు ఈ వ్యవస్థను టేకోవర్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇదివరకూ ప్రచారమైన సంగతి తెలిసిందే.