మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 22 వ తేదీతో అన్నయ్య 65వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో చిరు బర్త్ డే వేడుకలను గతంలో మాదిరే భారీగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతీ ఏడాది చిరంజీవి ఓ పెద్ద ఈవెంట్ లా ఈ కార్యక్రమాన్ని పలువురు అభిమానుల సమక్షంలో జరుపు కుంటుంటారు. కానీ ఈసారి కరోనా మహమ్మారి ఉంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఏవీ ఆయన ఏర్పాటు చేసే అవకాశం లేదు. అయితే అభిమానులు మాత్రం రిచ్ గానే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
# చిరు బర్త్ డే ఫెస్ట్ బిగెన్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. అలాగే చిరు బర్త్ డే కి సంబంధించి ఓ కామన్ మోషన్ పోస్టర్ ఒకటి ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీలోని 65 మంది సెలబ్రిటీలతో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి కార్యక్రమం ఏ హీరోకి జరగలేదు. ఈ నేపథ్యంలో చిరు ఆ రకంగానూ ఖ్యాతికెక్కబోతున్నారు. ఆ విషయం పక్కన బెడితే బర్త్ డే సందర్భంగా ప్రతీ ఏడాది భారీ ఎత్తున మెగా అభిమాన సంఘాలు రక్త దాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ర్టాలు సహా కర్ణాటక రాష్ర్టంలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగోలేదు కాబట్టి అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా? లేదా? అన్న దానిపై సరైన క్లారిటీ లేదు.
అయితే ఈ ఏడాది రక్తదానం సేవా కార్యక్రమం కన్నా అభిమానులు ప్లాస్మా సేకరణ కార్యక్రమం చేపడితే ఎంతో ఉత్తమంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా పేషెంట్లు కోలుకోవడానికి ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని ప్లాస్మా చాలా వేగంగా అభివృద్ది చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా సోకి కోలుకున్న మెగా అభిమానులంతా ఆ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుంది! అన్నది కొందరి అభిప్రాయం. చిరంజీవి కూడా దీనిపై అవేర్ నేస్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటీవలే సీపీ సజ్జనార్ సమక్షంలో జరిగిన ఓ పోలీస్ ఈవెంట్ లో చిరంజీవి అతిధిగా హాజరై కరోనా తో కోలుకున్న వారంతా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా కలిసి కరోనా నుంచి కోలుకున్న వారి జాబితా ఒకటి సిద్దం చేసుకుని..వాళ్లలో అవేర్ నెస్ తీసుకొచ్చి ప్లాస్మా దానం చేయించగల్గితే అంతకన్నా అన్నయ్యకు పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చేది ఏముంటుంది.