కంగారు పడకండి..తమన్నా ఏమిటి..హనీమూన్ ఏమిటని… ఇదంతా తమన్నా నటిస్తున్న కొత్త సినిమా ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’కు సంభందించింది. హిందీ సూపర్ హిట్ ‘క్వీన్’కు తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా పదహారణాల తెలుగమ్మాయి పాత్రలో నటిస్తోంది.
ప్యారిస్ లో ఉన్న ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో తమన్నా రాజమండ్రి అమ్మాయి గా కనిపించి అలరించింది.
అమాయకంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ఎలా శక్తివంతమైన మహిళగా మారుతుంది అనేది దట్ ఈజ్ మహాలక్ష్మి కథ. ‘నా పేరు మహాలక్ష్మి.. నేను నా హనీమూన్‌కు వచ్చాను’ అంటూ తమన్నా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.
అలాగే ‘రాజమండ్రిలో ఒక బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్‌ను ఇలాగ నిల్చోబెడితే మీ ఈఫిల్ టవర్ ఉందికదా.. అది ఉడతలాగా ఉంటది’ అంటూ తూర్పు గోదావరి యాసలో తమన్నా చెప్పే డైలాగులు బాగున్నాయి.
‘దట్ ఈజ్ మహాలక్ష్మి’లో శివానీ దండేకర్, సంజయ్ స్వరూప్, జగపతిబాబు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇదే చిత్రం తమిళ వెర్షన్‌లో కాజల్ నటిస్తున్నారు. ‘ప్యారిస్ ప్యారిస్’ అనే టైటిల్‌తో దీన్ని విడుదల చేస్తున్నారు.
అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ టబూరియస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా. మీడియెంట్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో మను కుమరన్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దట్ ఈజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం.