వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరిట ఎన్టీఆర్ చరమాంక జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుంచి నడిచిన కథను రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రానికి బ్రేక్ లు పడే వాతావరణం కనపడుతోంది.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ చిత్రం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆపాలని కోరారు.
సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు .. పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు.
కాగా ఈ విషయంపై చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబును నెగెటివ్‌గా చూపించారని టీడీపీ భావిస్తోంది. నిజాన్నిఎవరూ దాచలేరని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి’ అని ఆర్జీవీ ట్విట్ చేశారు.