ఓటీటీ ద్వారా ఆశించిన ఫలితం!

లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది తారలు రకరకాల యాక్టివిటీస్‌తో వార్తల్లో నిలిచారు. ఎప్పుడు హుషారుగా, సందడి చేస్తూ కనిపించే తాప్సీ సైతం లాక్‌డౌన్‌ ప్రకటించగానే ఒక్కసారిగా మౌనం దాల్చింది.  కారణమేంటి? అని ఇటీవల కలిసిన  తాప్సీని కదిలిస్తీ..  దానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. గత రెండేళ్లుగా ఆరు సినిమాలు చేశాను. తీరికలేని షెడ్యూళ్లతో ఏనాడు విరామం దొరకలేదు.

బిజీగా సాగుతున్న నా లైఫ్‌కు లాక్‌డౌన్‌ వల్ల కావాల్సిన బ్రేక్‌ దొరికినట్లనిపించింది. ”గృహహింసను కథావస్తువుగా తీసుకొని నేను ప్రధాన పాత్రలో నటించిన ‘థప్పడ్‌’ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. థియేటర్స్‌లో రెండు వారాల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లు మూతపడటంతో మంచి కలెక్షన్లతో సాగుతున్న ‘థప్పడ్‌’ సినిమా నష్టపోయింది. అయితే ఓటీటీ ద్వారా తిరిగి మేము ఆశించిన ఫలితాన్ని సాధించగలిగాం. లాక్‌డౌన్‌ అనంతరం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశాం. ఆ వేదికపై కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

 ఇక అక్షయ్‌కుమార్‌ ‘బేబి’ లో చిన్న అతిథి పాత్రలో కనిపించా. కెరీర్‌ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆ తరహా పాత్ర ఎందుకు చేసావని చాలా మంది ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా నటిగా నాలోని తెలియని పార్శాల్ని ఆవిష్కరించుకునే పనిలో ఉన్నా. క్యారెక్టర్‌లో కొత్తదనం నచ్చితే సినిమాల్ని ఒప్పుకుంటున్నా. కెరీర్‌ ఆరంభంలో తెలుగు చిత్రాల్లో గ్లామర్‌ పాత్రల్లోనే కనిపించా. కమర్షియల్‌ నాయికగా ఎదగాలంటే.. అదే మార్గమని నమ్మాను. కాలక్రమంలో నాలో పరిణితి వచ్చింది. నేను నమ్మిన మార్గం తప్పని తెలుసుకుని… పూర్తిగా అభినయప్రధాన సినిమాల వైపు మళ్లాను.

అందుకు బాలీవుడ్‌ చక్కటి వేదికగా నిలిచింది. దక్షిణాదిలో కూడా మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నా. బాలీవుడ్‌లో ‘రష్మీ రాకెట్‌’ ‘శభాష్‌ మిత్తు’ ‘హసీనా దిల్‌రుబా’ సినిమాలు చేస్తున్నా. పూర్తి భిన్నమైన చిత్రాలివి. ‘రష్మీ రాకెట్‌’ చిత్రాన్ని ఓ స్ప్రింటర్‌ జీవితంలో జరిగిన యథార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఇప్పటివరకు శారీరకంగా నన్ను ఛాలెంజ్‌ చేసిన పాత్రల్ని పోషించలేదు. ‘రష్మీ రాకెట్‌’ సవాలుతో కూడిన పాత్ర. అందుకే ఈ సినిమా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాఅంటూ చెప్పుకొచ్చింది