తెలుగు రాష్ట్రాల బాదుడెంత?
భారీ చిత్రాలకు తొలి వారం టిక్కెట్టు బాదుడు వ్యవహారం చూస్తున్నదే. ఇంతకుముందు బాహుబలి సిరీస్ మొదలు నిన్న మొన్న రిలీజైన `సాహో` వరకూ ఇదే పంథాని అనుసరించారు. రంగస్థలం- భరత్ అనే నేను సహా పలు భారీ చిత్రాలకు టిక్కెట్లు ధరల్ని పెంచుకుని జనాల నుంచి భారీగానే దండుకున్నారు. అయితే అత్యంత భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నామని కలరింగ్ ఇచ్చి ఇష్టానుసారం టిక్కెట్లు పెంచేసుకోవడంపై జనాలు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాన్య జనం కేవలం వినోదానికే పెద్ద బడ్జెట్లు కేటాయించాల్సిన ధైన్యం నెలకొంది.
ఫ్యామిలీకి టిక్కెట్లకు రూ.10,000 ఖర్చు
సైరా చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం టిక్కెట్టు పెంపు ఉంటుందని తెలిసింది. అలాగే అమెరికాలోనూ భారీగానే పెంచేసి అమ్ముతున్నారన్నది సమాచారం. ఉత్తర అమెరికాలో ఒక్కో టిక్కెట్టుకు 15 డాలర్లు మినిమం కాగా.. 28 డాలర్ల గరిష్ఠ మొత్తం దండుకుంటున్నారట. ఐమ్యాక్స్ స్క్రీన్లకు పెద్దలకు 28 డాలర్లు, కిడ్స్ కి 18 డాలర్లు నిర్ణయించారు. సాధారణ స్క్రీన్లలో పెద్దలకు 25 డాలర్లు, పిల్లలకు అయితే 15 డాలర్లు చెల్లించాలి. డాలర్ విలువ రూ.72 ఉంది. అంటే 10 డాలర్లు రూ.720. అంటే రూ. 1500 – రూ.2000 మధ్యలో ఒక్కో టిక్కెట్టుకు ఖర్చు చేస్తున్నారన్నమాట. ఐదుగురు ఉన్న కుటుంబం సినిమా చూడాలంటే సుమారు 6 వేల నుంచి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఉత్తర అమెరికాలో తెలుగు, హిందీతో పాటు తమిళ వెర్షన్ ని భారీగా రిలీజ్ చేయనున్నారు. నేటి సాయంత్రం సైరా ట్రైలర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.