దుబాయ్ నుంచి తొలి రివ్యూ.. క్రిటిక్ ఉమైర్ సంధు కితాబు
మోస్ట్ అవైటెడ్ `సైరా నరసింహారెడ్డి` అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కెరీర్ లోనే తొలి హిస్టారికల్ చిత్రమిది. దాంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 270కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసిన ఈ చిత్రంపై ప్రోమోలు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. గాంధీ జయంతి రోజున మెగా ట్రీట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా ఎలా ఉంది అన్నది చూసినవాళ్ల నుంచి రిపోర్ట్ అందాల్సి ఉంది.
తాజాగా దుబాయ్ క్రిటిక్ ఉమైర్ సంధు నుంచి సైరా చిత్రంపై తొలి రివ్యూ వచ్చేసింది. మార్వలస్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్.. గ్రేట్ ట్రీట్ అంటూ సైరాపై ప్రశంసలు కురిపించారు ఉమైర్. సెన్సార్ పూర్తయింది. అసలు స్పీచ్ లెస్ అనిపిస్తోంది. నిలబడి చప్పట్లు కొట్టాను కొన్ని సీన్లకు. ఇది బ్లాక్ బస్టర్ హిట్. చిరంజీవి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు అంటూ కితాబిచ్చాడు.
బాహుబలి ఫిక్షన్ సినిమా. దాంతో పోలిస్తే ఇది మాత్రం చారిత్రక కథ. వీరుడి బయోపిక్ కాబట్టి అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. లైఫ్ టైమ్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. జాతీయ అవార్డు చిరు కోసం వేచి చూస్తోంది. గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఈ చిత్రంలో ఎన్నో ఉన్నాయి. చిరు నటన ఎంతో ఉద్విగ్నతకు గురి చేస్తుంది. ప్రతి సన్నివేశం కుర్చీ అంచున కూచుని చూసేంత ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. అలాగే సపోర్టింగ్ రోల్స్ బావున్నాయి. అమితాబ్ బచ్చన్ పాత్ర టెర్రిఫిక్. సుదీప్ పాత్ర అంతే ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు ఉమైర్ సంధు. అయితే ఉమైర్ సంధు ఇంతకుముందు సాహో విషయంలోనూ ఇలానే చెప్పారు. భారీ చిత్రాలకు ఆయన ఇచ్చే రివ్యూలు పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు సాహోకి 4 రేటింగ్ ఇచ్చిన ఉమైర్.. ఇప్పుడు సైరాకు 4 రేటింగ్ ఇచ్చాడు ఆయన. మరి అతడు చెప్పినట్టే ఈ సినిమా ఉందా? సురేందర్ రెడ్డి ఒక అద్భుతమైన కథను చెప్పారా? అన్నది చూడాల్సి ఉంటుంది.