హీరో గారూ…హిట్ ఇచ్చి కౌంటర్ ఇస్తేనే గౌరవం

ఒకప్పుడు వరస హిట్స్ తో దూసుకుపోయిన సూర్య ఇప్పుడు అసలు ఆ పదం విని చాలా కాలం అయ్యింది. ఎన్ని కొత్త కాంబినేషన్స్ తో సినిమాలు చేసినా అవేమీ వర్కవుట్ కావటం లేదు. దాంతో తమిళంలోనే కాదు తెలుగులోనూ మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యిపోయింది. అయితే దీనికి కారణం సూర్య సృయం కృతాపరాధమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కథను జడ్జిమెంట్ చేసుకోవటం, లేటెస్ట్ ట్రెండ్ లో ఉండటం అనే రెండు విషయాలను పట్టించుకోకపోవటమే అన్నదమ్ములిద్దరి మైనస్ అంటున్నారు.

తాజాగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య నటించిన ‘ఎన్‌జీకే’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా వాటిని ఒక్క దెబ్బతో మాయం చేసేసింది.దాంతో ఫ్యాన్స్ సైతం ఆవేదనలో కూరుకుపోయారు. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం చిత్రంలోని ప్రత్యేకతను చూసి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా నష్టాన్ని మిగిల్చిందని తమిళ సిని వర్గాలు తేల్చేసాయి.

దీనిపై తాజాగా సూర్య కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఈ సినిమాకు వచ్చిన అన్నిరకాల, అందరి అభిప్రాయాలను శిరసు వంచి స్వీకరిస్తున్నా. భిన్నమైన కథాంశం కలిగిన సినిమా ఇది. అలాగే భిన్నమైన నటనను, సాంకేతికపరమైన ప్రత్యేకతలను గుర్తించి.. అభినందించిన వారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా చివరకు ‘కత్తుక్కురేన్‌ తలైవరే’ (నేర్చుకుంటా గురూ) అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టారు.

అసలు ఇలాంటి కథలను ఎంచుకునేటప్పుడే సూర్య జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని పలువురు సినీ విశ్లేషకులు ప్రస్తావించారు. వాటిని దృష్టిలో పెట్టుకునే ‘ఎన్‌జీకే’ చిత్రంలో ఉన్న ‘కత్తుక్కురేన్‌ తలైవరే’ అనే డైలాగును.. ఈ సందర్భానికి అన్వయించి చెప్పారు సూర్య.