`A – ఆదిపురుష్` కోసం అద్దిరిపోయే విలన్ ని దించుతున్నారా? అంటే అవుననే బాలీవుడ్ వర్గాల సమాచారం. డార్లింగ్ ప్రభాస్ కి ధీటుగా ఢీకొట్టే ప్రతినాయకుడు ఈ సినిమాలో ఉండాలనేది దర్శకుడు ఓంరౌత్ కాన్సెప్ట్. అది కూడా తాను తెరకెక్కించిన తానాజీ చిత్రంలో సైఫ్ విలనీ బాగా వర్కవుట్ అయ్యింది కాబట్టి అతడినే ఈసారి కూడా ప్రభాస్ కోసం బరిలో దించాలని భావిస్తున్నారట.
సైఫ్ ఖాన్ ఇంటెన్సిటీ ఉన్న నటుడు. బాలీవుడ్ లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. అయితే హీరోగా అతడికి ఇటీవలి కాలంలో అంతగా వర్కవుట్ కావడం లేదు. దాంతో ఓటీటీ లో వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యాడు. కానీ తానాజీ లాంటి హిస్టారికల్ సినిమాలో నటించాక కంబ్యాక్ అయ్యాడు. అడపాదడపా బాలీవుడ్ సినిమాలకు సంతకాలు చేస్తూనే వెబ్ సినిమాల్ని వదిలి పెట్టడం లేదు అతడు. ఇక తానాజీ చిత్రాన్ని ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించిన ఓంరౌత్ టీసిరీస్ లాంటి దిగ్గజ సంస్థతో కలిసి దాదాపు 500కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ తో `ఏ-ఆదిపురుష్` చిత్రాన్ని 3డిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తుంటే ఈ ప్రాజెక్టుకి సైఫ్ పుషప్ బాగానే ఉందని తెలుస్తోంది.
`ఆదిపురుష్ 3డి`లో విలన్ (రావణాసురుడి తరహా)గా సైఫ్ నటిస్తున్నాడన్న విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట. అలాగే ఈ సినిమా కథకు రామాయణం స్ఫూర్తి కాబట్టి అందులో పాత్రలన్నిటి నుంచి స్ఫూర్తి పొందే వీలుంది. సీత.. ఆంజనేయుడు .. లక్ష్మణుడు వంటి కీలక పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తారు. ఆ పాత్రల్ని అచ్చంగా అదే తీరుగా తీర్చిదిద్దుతారా.. లేక అవసరాన్ని బట్టి మార్పు చేర్పులు చేస్తారా? అన్నది చూడాలి. ఆది పురుష్ ని భారీ పాన్ (ఇండియా) వరల్డ్ మూవీగా తీర్చిదిద్దేందుకు ఓంరౌత్ భారీ ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ ఇమేజ్ ని అమాంతం మార్చేసే సినిమా ఇదని భావిస్తున్నారు.