డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్ని ప్రకటిస్తూ హీట్ పెంచేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 20 – రాధేశ్యామ్ చిత్రీకరణ పూర్తవ్వక ముందే మరో రెండు సినిమాల్ని ప్రకటించేశాడు. ఇవి రెండూ క్రేజీగా పాన్ వరల్డ్ (ఇండియా) రేంజు అంటూ ప్రచారం సాగుతోంది. వీటికోసం నిర్మాతలు దాదాపు 500 కోట్ల బడ్జెట్లను సిద్ధం చేస్తున్నారని అందుకోసం భాగస్వామ్య ఒప్పందాల ప్రకారం పని చేస్తున్నారని తెలుస్తోంది. పలువురు నిర్మాతల్ని కలుపుకుని హాలీవుడ్ తరహాలో భారీ పాన్ ఇండియా సినిమాల్ని తెరకెక్కించేందుకు కసరత్తు చేశాకే వీటీని ప్రకటించారు.
అయితే ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాని ప్రకటించక ముందు టీసిరీస్ వాళ్లతో చాలానే మంతనాలు సాగాయట. రాధేశ్యామ్ చిత్రానికి స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా హిందీ పంపిణీదారుగా ఉన్న టీసిరీస్ వాళ్లు వరుసగా ప్రభాస్ ని పలు ప్రాజెక్టులకు లాక్ చేశారు. అప్పట్లోనే సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమాకి టీసిరీస్ ప్లాన్ చేసింది. సందీప్ రెడ్డి చెప్పిన కథ నచ్చకపోవడంతో అది కాస్తా క్యాన్సిల్ అయ్యిందట. ప్రభాస్ – సందీప్ రెడ్డి ప్రాజెక్టు కోసం సన్నాహకాల్లో ఉన్న సమయంలోనే తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ టీసిరీస్ బృందానికి కథ వినిపించి ప్రభాస్ ని లాక్ చేసేసాడని తెలుస్తోంది.
సందీప్ చెప్పిన యాక్షన్ స్టోరీ నచ్చకపోవడం అదే క్రమంలో ఓంరౌత్ మెలూహా తరహా ఫిక్షనల్ కథాంశంతో ఒప్పించేయడంతో టీసిరీస్ ఈ ప్రాజెక్టును భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమైంది. బాహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజులో ఈ సినిమాని తీయాలన్నది వీళ్ల ప్లాన్. అయితే సందీప్ రెడ్డికి టీసిరీస్ లో మరో సినిమా ఉంటుంది.. అది ఏ స్టార్ తో అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రభాస్ – ఓం రౌత్ ప్రాజెక్టును 500 కోట్ల బడ్జెట్ తో టీసిరీస్ తెరకెక్కించనుంది. 2.0 ను మించిన విజువల్ గ్రాఫిక్స్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట.