ప్రమాదకర జ్వరాలు.. తస్మాత్ జాగ్రత్త
రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గడం అన్నది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. దీనినే డెంగీ జ్వరం అని పిలుస్తారు. ఈ జ్వరం వస్తే సామాన్యులు సరైన ట్రీట్ మెంట్ అందక చనిపోయే పరిస్థితి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇదొక్కటేనా వర్షాల సీజన్ మొదలైతే చాలు దోమల వల్ల వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. వైరల్ ఫీవర్లతో అల్లకల్లోలం అయిపోతుంది పరిస్థితి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని జ్వరాలు భయపెట్టేస్తున్నాయి. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందినా.. మెడిసిన్ అందుబాటులోకి వచ్చినా ఏం ఉపయోగం? వైద్యం వ్యాపారంగా మారిన తరుణంలో గవర్నమెంట్ డాక్టర్లు ప్రయివేటు క్లినిక్ లు నడుపుకుంటున్న దారుణ మారణ హోమంలో సామాన్యుడు బతకడం ఎలా అన్న సందిగ్ధత నెలకొంది.
అయితే ఈ ప్రమాదాల నుంచి సామాన్య ప్రజలు భయటపడడం ఎలా? వారిని అప్రమత్తం చేయడమెలా? అంటే.. వీలున్నంత వరకూ పరిసరాల పరిశుభ్రతను అలవాటు చేయాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చేస్తే దోమలు చేరవు. పరిసరాల్లో చెత్త అసలే ఉండకూడదు. అదే పనిని తాను ఆచరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అవి అందరిలో స్ఫూర్తిని నింపుతున్నాయి.
ఆసక్తికరంగా దీనికి ప్రతిస్పందించిన సూపర్ స్టార్ మహేష్.. రెబల్ స్టార్ ప్రభాస్ వాటిని అభిమానులకు ట్వీట్లు.. రీట్వీట్లు చేయడంతో అవి కాస్తా అందరిలోకి దూసుకెళుతున్నాయి. చేసిన పని ఏదైనా అది ప్రజాప్రయోజనకరమైన పని కావడంతో ప్రభాస్, మహేష్ లపై ప్రశంసలు కురుస్తున్నాయి. పరిసరాల పరిశుభ్రత అన్న ఉద్యమానికి సహకరించినందుకు ప్రభాస్, మహేష్ ఇద్దరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంతకుముందు పచ్చదనం, మొక్కల పెంపకం వంటి గొప్ప కార్యాలు చేపట్టినప్పుడు కేసీఆర, కేటీఆర్, చంద్రబాబు వంటి నాయకులకు మన స్టార్లు అండగా నిలిచి ప్రచారం చేశారు. ఇంకుడు కుంతలు తవ్వడం, చేనేత వంటి వాటికి ఊతమిచ్చేందుకు స్టార్లు ప్రచారం కలిసొచ్చింది. సామాజిక సేవల్లో మేము సైతం అంటూ స్టార్లు ఇలా ముందుకొస్తే కొంతవరకూ మంచి సమాజం వైపు అడుగులు వేయడం సాధ్యపడుతుందనడంలో సందేహం లేదు. మహేష్, ప్రభాస్ బాటలోనే చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్లు ఈ తరహా ప్రచారానికి ముందుకొస్తే అభిమానుల్లోకి ఇలాంటివి వైరల్ గా దూసుకెళతాయనడంలో సందేహమే లేదు.