స్వీయనిర్భంధం వల్ల ప్రజలు ఇండ్లలోంచి బయటికి రావడం లేదు. ఈ పర్యవసానం ప్రభావం అన్ని పరిశ్రమల కంటే వినోదపరిశ్రమపైనే అధికంగా పడిందని వాపోయారు అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు. ఇప్పట్లో థియేటర్లు తెరిచే సన్నివేశమే లేదని ఆయన అన్నారు. థియేటర్లు తెరిచినా జనం వస్తారా రారా? అన్న సందిగ్ధత ఉందని.. దీనివల్ల తెరిస్తేనే ఎక్కువ నష్టం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏడాది తరవాత తీస్తారా లేక మెడిసిన్ వచ్చాక తీస్తారా? అన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఏదేమైనా ఎగ్జిబిషన్ వ్యవస్థ పూర్తి సంక్షోభంలో పడిపోయిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు థియేటర్లు తెరుస్తారని తిరిగి యథావిధి గా మంచి జరుగుతుందని ఆశావహ దృక్పథంతో ఉన్నామని తెలిపారు. భారతదేశంలో 10 వేల థియేటర్లు.. తెలుగు రాష్ట్రాల్లో 2వేల థియేటర్లు ఆగమ్యగోచరంలో పడిపోయాయని ఆయన వెల్లడించారు. థియేటర్ వ్యవస్థ చాలా డేంజర్ లో పడిపోయింది. కోలుకోవడం అంత సులువు కాదని అన్నారు. ఆ నలుగురిలో ఉద్ధండుడు.. ఎగ్జిబిషన్ రంగంలో తలపండినవాడు అయినా సురేష్ బాబు భయాందోళన గమనిస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. థియేటర్లు తెరిచినా జనం రారని ఆయనే ఖరాకండిగా చెప్పేస్తున్నాడు. పైగా ఇలాంటి టైమ్ లో థియేటర్లు తెరిచేస్తే నష్టం పెరుగుతుందే కానీ తగ్గదని అన్నాడు. జరగకూడనిది ఏదైనా జరిగితే దాని దెబ్బకు ఎగ్జిబిషన్ వ్యవస్థ తుడిచిపెట్టుకు పోతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. జనం గుమిగూడేది థియేటర్లలో.. సామాజిక దూరం పాటించాలన్న నియమం కూడా సరికాదన్న అభిప్రాయమే ఆయన వ్యక్తం చేయడం చూస్తుంటే ప్రమాద స్థాయి ఏ రేంజులో ఉందో అర్థమవుతోంది. టాలీవుడ్ కి తాజా సన్నివేశం పెద్ద రేంజులో పంచ్ వేసిందని క్లియర్ కట్ గా స్పష్టమవుతోంది.