అగ్ర నిర్మాత కం ఆల్ రౌండర్ అల్లు అరవింద్ ముందు చూపు గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన చాలా ముందే ఓటీటీ – డిజిటల్ కి ఉన్న ఆదరణపై అంచనా వేశారు. ఏ ఇతర నిర్మాతా చేయలేని సాహసం చేశారు. తనకంటూ ప్రత్యేకించి ఓటీటీ వేదిక అవసరం అని గ్రహించి `ఆహా-తెలుగు` యాప్ ను ప్రారంభించారు. అందుకోసం అలుపెరగక శ్రమించడమే గాక చెప్పుకోదగ్గ బడ్జెట్లనే కేటాయించారు. అయితే ఆహాకు ఆరంభం మిశ్రమ స్పందనలే వచ్చాయి. కంటెంట్ ఏమంత బాలేదన్న విమర్శలొచ్చాయి. ఇలా అయితే ఇక్కడ సక్సెస్ కాలేరన్న విమర్శలు వేడెక్కించాయి.
అయినా మొండి పట్టుదలతో విక్రమార్కుడిలా ఆయన తన ప్రణాళికల్ని విస్తరిస్తూనే ఉన్నారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి ని లాక్ చేసి ఓ వెబ్ సిరీస్ ని కానీ సరైన రియాలిటీ షో కానీ ప్లాన్ చేయాలనే యోచన చేస్తున్నట్టు ఇటీవల గుసగుసలు వినిపించాయి. ఇప్పటికీ ఆహా పై మిశ్రమ స్పందనలే వ్యక్తమవుతున్నాయి. పలువురు నవతరం దర్శకులు వినిపించిన కథల్ని ఓకే చేసి వెబ్ సిరీస్ లను నిర్మించారు. అయితే వీటికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కొత్త ముఖాలతో చేసిన ప్రయత్నాలేవీ ఆశించినంత మైలేజ్ ని తేలేదు ఎందుకనో.
ఆహా కోసం వెచ్చించిన బడ్జెట్లు పెద్దవే… కొన్ని స్క్రిప్ట్‌లు వినూత్నంగా అనిపించినప్పటికీ, వెబ్ ఆధారిత కంటెంట్‌ను హ్యాండిల్ చేయడంలో దర్శకులకు తగినంత అనుభవం లేకపోవడం మైనస్ గా మారింది. ఇప్పటికిప్పుడు దాదాపు 25 కొత్త సిరీస్ లు ప్లాన్ చేశారు. అవన్నీ ఒకటొకటిగా ఈ సంవత్సరం ముగిసేలోపు ఆహాలో విడుదల కావాల్సి ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో కరోనావైరస్ మహమ్మారీ పెద్ద దెబ్బ కొట్టింది. షూటింగులు అర్థాంతరంగా నిలిచిపోవడం పెద్ద మైనస్ అయ్యింది.
తాజా సన్నివేశంతో నేరుగా తానే దర్శకుల కు తగినంత సమయం వెచ్చించి స్క్రిప్ట్‌లను తిరిగి పరిశీలించారట. ఇప్పటికి కొన్ని ప్రాజెక్టులను నిలిపివేసి రివ్యూలు చేస్తున్నారట. ఓవైపు సన్నివేశం ఇలా ఉన్నా ఏమాత్రం నిరాశను దరి చేరనీయక.. పలువురు టాలీవుడ్ దర్శకులతో వెబ్ సిరీస్ ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆహా కోసం వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్న వారికి భారీగా పారితోషికాల్ని ఏర్పాటు చేశారు. మేకింగ్ క్వాలిటీ కోసం మంచి బడ్జెట్లను ఇచ్చారని తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ కి అదనపు మైలేజీని తీసుకువచ్చే ప్రాజెక్ట్ కోసం మెగాస్టార్ చిరంజీవిని లాక్ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. వరుసగా వేడెక్కించే సిరీస్ లతో మోతెక్కించేందుకు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్ వేదికపై సత్తా చాటడమే ధ్యేయగం ఆరవింద్ పట్టుదల కొనసాగిస్తున్నారు. ఏటికి ఎదురీతే అయినా అక్కడ గెలిచి తీరాలన్న పంతంతో ఉన్నారట.