నాగబాబు విడుదల చేస్తున్న వీడియోలకు ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆడవాళ్ళ డ్రెస్సులపై జరుగుతున్న పరిణామాలపై చేసిన కామెంట్స్ కు స్పందిస్తూ తన యూ ట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు నాగబాబు. దాంతో ఎస్పీబి కామెంట్స్ ఖండించేవే కావచ్చు కానీ, మీరు స్పందించిన విధానం బాగోలేదంటూ సోషల్ మీడియా జనం ఆయనపై విరుచుకుపడుతున్నారు. వరస ట్రోల్స్ తో నాగబాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఇందులో ఆయన పర్శనల్ ఫ్యామిలీ మాటర్స్ ని కూడా తీసుకుని వస్తున్నారు. ఇది నిజానికి నాగబాబుకు ఊహించని పరిణామమే. ఆ ట్రోల్ చేసేవాళ్ళు ఎస్పీబి అభిమానులా లేక నాగబాబు టార్గెట్ చేస్తున్న బాలయ్య ఫ్యాన్సా లేక నాగబాబు వీడియోని చూసి స్పందించిన వాళ్లా అనేది తెలియటం లేదు. ఇదిలా ఉంటే జబర్దస్త్ ఏంకర్ ప్రముఖ నటి రష్మి.. సినీ నటుడు నాగబాబుకు ధాంక్స్ తెలిపారు.
ఇంతకీ వివాదం ఏమిటి..
ఇటీవల ప్రముఖ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం హీరోయిన్లు వేసుకునే దుస్తులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఊహంచని విధంగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నాగబాబు స్పందిస్తూ.. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘అసలు ఆడవారు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? నాకు తెలిసినంతవరకు పొట్టి దుస్తులు వేసుకునే వారిపైనే కాదు.. ఒళ్లంతా నిండుగా కప్పుకొనే ఆడపిల్లల పైనా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఫలానా రకమైన దుస్తులు వేసుకోవడం వల్లే మగవారు వారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారని అనుకోవడం తప్పు. ఎలాంటి దుస్తులైనా వేసుకునే హక్కు ఆడవారికి ఉంటుంది. అదే ఆడపిల్ల.. ఓ మగవాడ్ని ‘ప్యాంట్స్ వేసుకోవద్దు, అది మన సంప్రదాయం కాదు, పంచెలు కట్టుకోండి’ అని ఎప్పుడైనా అనడం విన్నారా? అసలు మీ కళ్లు ఆడవారి దుస్తులపైకి ఎందుకు వెళ్తున్నాయ్?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియోను రష్మి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘వేసుకునే దుస్తులకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలుంటాయి. ఆ గొప్పతనాన్ని వారు వేసుకునే దుస్తుల దృష్టి నుంచి చూడకండి. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు నాగబాబు సర్..’ అని పేర్కొన్నారు.