టాలీవుడ్ పాప్ సింగర్ స్మితకు కరోనా సోకిందన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య తనకు కరోనా సోకిందంటూ చేసిన ట్వీట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అసలే టాలీవుడ్‌లో కరోనా విజృంభిస్తుండగా.. సింగర్స్ వరుసగా వైరస్ బారిన పడటం ఆందోళనకరంగా మారింది. ఈ మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తాజాగా మాళవిక, సునీతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
ఇక స్మిత తనకు కరోనా సోకందని చెబుతూ.. ‘నిన్నంతా పిచ్చిలేచింది. ఒళ్లు నొప్పులు బాగా వచ్చాయి.. వర్కౌట్లు చేయడం వల్లే అవి వస్తున్నాయని అనుకున్నాను. కానీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయిస్తే నాకు, నా భర్త(శశాంక్)కు కరోనా పాజిటివ్ అని తేలింది. లక్షణాలేవీ లేవు. కరోనాను తన్ని అవతల పంపించేందుకు, ప్లాస్మా దానం చేయాలని, సంతోషంగా ఉండాలని ఎదురుచూస్తున్నాను. మేము ఇంట్లోనూ ఉన్నాం.. సురక్షితంగానే ఉన్నాం.. కానీ కరోనా మా ఇంటికి వచ్చింద’ని ఎంతో సెటైరికల్‌గా స్పందించింది.
ఇక తాజాగా కరోనా నుంచి కోలుకున్న స్మిత ఓ ట్వీట్ చేసింది. ‘గుడ్ ఈవినింగ్, ఇంటికి తిరిగి వచ్చాను. ఎంతో బాగున్నాను. మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్, గత ఇరవై రోజులుగా కరోనా నాతో ఎలా ఆడుకుందో నా అనుభవాలు ఏంటో చిన్న చిన్న వీడియోల రూపంలో చెబుతాను. అవన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలె రాజమౌళి కుటుంబం కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.