సక్సెస్ మీట్ ఏంటి..సిల్లీగా

                                                          (సూర్యం)

 హిట్ కొట్టిన తర్వాత సక్సెస్ మీట్ పెడితే చూసేవారికి, ఆ పోగ్రాం పెట్టిన వారికి హ్యాపీగా ఉంటుంది. అదే సినిమాకు ప్లాఫ్ టాక్ వచ్చేసి, జనాలు బాగోలేదు  బాబోయ్ అనేసి సినిమాని దూరం పెట్టేసాక సక్సెస్ మీట్,  విజయోత్సవం అంటే …నవ్వేసుకుంటారు. ఇప్పుడు అదే సిల్లీఫెలోస్ కు జరుగుతోంది.

సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’. కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి,విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. అయితే ఈ చిత్రం మార్నింగ్ షో కే తేడా టాక్ వచ్చేసింది. అయితేనేం అవేమీ మాకు పట్టవు అన్నట్లుగా …ఈ   మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ విజయోత్సవాన్ని అదే సక్సెస్ మీట్ ని  నిర్వహించింది.

దాంతో ఇది మీడియాలో నవ్వులాటగా మారింది. టీవీల్లో చూస్తున్న జనం కూడా ఏంటి సినిమా హిట్టా అనేసి నవ్వేసుకుంటున్నారు. కొంతమంది సినిమావాళ్లైతే..ఇదిగో ఇలాంటి సక్సెస్ మీట్ లు పెట్టే…అసలు నిజంగా హిట్టైన సినిమాల సక్సెస్ మీట్ లకు వాల్యూ లేకుండా చేస్తున్నారు అని బాధపడిపోయారు.

‘‘నరేష్‌కి సునీల్‌ తోడవడం, పిల్లల్ని కూడా నవ్వించే సన్నివేశాలుండటంతో చిత్రం అందరినీ అలరిస్తోంది. జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళిల కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చింది’’ అన్నారు భీమనేని. అల్లరి నరేష్ మరో అడుగు ముందుకేసి  ‘‘నా సినిమాల్లో ‘కితకితలు’ తర్వాత పిల్లల్ని బాగా నవ్విస్తున్న చిత్రం ఇదే’’ అన్నారు .

మేమేం తక్కువ తిన్నామా అన్నట్లు నిర్మాతలు ‘‘ఏ లాజిక్‌ లేకుండా మ్యాజిక్‌తో నవ్వులు పూయించాలనే తపనతో తీశాం. కోడి కూత సన్నివేశాన్ని చూసి మా పిల్లలు తెగ నవ్వుకుంటున్నారంటూ చాలా ప్రాంతాల నుంచి మాకు సందేశాలొచ్చాయి’’ అన్నారు నిర్మాతలు. కార్యక్రమంలో అనిల్‌ సుంకర, పోకూరి బాబూరావు, పంపిణీదారుడు బాబ్జీ, గాయకుడు ప్రణవ్‌ చాగంటి, గీతరచయిత చిలకరెక్క గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.