జయప్రకాష్ రెడ్డి షో మాత్రమే! ‘సిల్లీ ఫెలోస్’ (మూవీ రివ్యూ)

( సికిందర్ )


‘సిల్లీ ఫెలోస్’ 

ద‌ర్శ‌కత్వం : భీమనేని శ్రీ‌నివాస్
తారాగ‌ణం: అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, నందినీ రాయ్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌, చ‌ల‌ప‌తిరావు, అదుర్స్ ర‌ఘు,ఝాన్సీ, హేమ త‌దిత‌రులు
సంగీతం : శ్రీ‌వ‌సంత్, ఛాయాగ్రహణం :  అనీష్ త‌రుణ్ కుమార్
నిర్మాణ సంస్థ‌లు: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ – బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
నిర్మాత‌లు: కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి
విడుదల : సెప్టెంబర్ 7, 2018

 

మా రేటింగ్ 2 / 5



కథ 

 

          వీరబాబు (అల్లరి నరేష్) ఒక టైలర్. జాకెట్లు కుట్టి ఎమ్మెల్యే అయిన జాకెట్ జానకి రాం జయప్రకాష్ రెడ్డి) శిష్యుడు. అతడి కోసం ఏమైనా చేస్తాడు. ఒకరోజు జానకి రాం సామూహిక వివాహాల కార్యక్రమానికి డమ్మీ పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ళని సమకూరుస్తాడు. ఒక పెళ్లి కొడుకు లేకపోతే వాడి స్థానంలో ఫ్రెండ్ సూరి బాబు (సునీల్) చేత పుష్ప (నందినిరాయ్) అనే పెళ్లి కూతురికి తాళి కట్టిస్తాడు. ఇక్కడ గిమ్మిక్కు ఏమిటంటే, ఈ ఉత్తుత్తి సామూహిక వివాహాలతో జానకీ రాం బిల్డప్ ఇస్తున్నాడు కాబట్టి తాళి కట్టినట్టు మాత్రమె నటించాలి. అయితే సూరిబాబు నిజంగానే తాళి కట్టేసి ఇరుక్కుంటాడు. అటు

 

అతణ్ణి ప్రేమిస్తున్న అమ్మాయి (పూర్ణ) ఒక్కటే షరతు పెడుతుంది. పుష్పకి విడకులిచ్చాకే తనని  చేసుకోవాలని.  ఇటు వీరబాబు ఒక హోటల్ యజమానురాలి (ఝాన్సీ) కూతురు (చిత్రా శుక్లా) ని ప్రేమిస్తూంటాడు. ఆమె ఎస్సై  ఉద్యోగ కోసం ప్రయత్నాల్లో వుంటుంది. ఆమె తల్లి వీరబాబుకి పది లక్షలిచ్చి. ఎలాగైనా  జానకిరాం కి చెప్పి ఉద్యోగం ఇప్పించమని కోరుతుంది. ఆ డబ్బు తీసికెళ్ళి జానకిరాం కిచ్చేసి ఇరుక్కుంటాడు వీరబాబు. 

 

          ఇలా వుండగా ఒక మంత్రి (మెల్కోటే) చనిపోతూ జానకి రామ్ చెవిలో తను దాచిన 500 కోట్ల రహస్యం చెప్తాడు. దీంతో అ మంత్రి బావమరిది (పోసాని), ఇంకో నాయకుడు (రాజారవీంద్ర) అ రహస్యం తెలుసు కోవాలని జానకీ రామ్ ని కిడ్నాప్ చేస్తారు. ఈ ప్రయత్నంలో  కోమాలోకి వెళ్లి లేచిన జానకి రాం జ్ఞాపక శక్తి కోల్పోతాడు. ఇటు వీరబాబు, సూరిబాబులకి కూడా ప్రేమిస్తున్న అమ్మాయిలతో సమస్యలు తీరాలంటే జానకి రాం సాయం అవసరం, అటు 500 కోట్ల రహస్యం తెలుసుకోవాలని వాళ్ళ ప్రయత్నం – ఇన్నిటి మధ్య  జానకిరాం ఏం చేశాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ

 తమిళంలో ఎళిల్ అనే యువ దర్శకుడు తీసిన హిట్ కామెడీ ‘వేళైనూ వందుట్ట వేళైకారన్’ (పని దగ్గర మనోడు ఇంగ్లీషోడు) కి రీమేక్ ఈ మూస ఫార్ములా కామెడీ కథ. తమిళంలో విష్ణు విశాల్, సూరీలు నటించారు. లాజిక్, కామన్ సెన్సు అనే మాటలకి దూరంగా అల్లిన బలహీన కథ ఇది. దీన్ని యధాతధంగా రీమేక్ చేశారు. 

ఎవరేలా చేశారు 

          అల్లరి నరేష్, సునీల్ లు వాళ్ళ రొటీన్ నటనతోనే సరిపెట్టారు. కాకపోతే కమెడియన్ గా ప్రేక్షకులకి దూరమైన సునీల్ ఇప్పుడు కమెడియన్ గా ఫ్రెష్ గ కనిపిస్తాడు. తమిళంలో ఇద్దరు హీరోల కథ కాదు. ఒక హీరో, అతడి పక్క కమెడియన్ కథ. రెండూ సమాన స్థాయి పాత్రలే. తెలుగులోనూ ఇంతే జరిగింది, కాకపోతే ఇద్దరూ హీరోలే. 

          ఈ కామెడీకి అసలు హీరో జయప్రకాష్ రెడ్దియే. ఈయన చుట్టే కథ వుండడం వలన ఈయనకే కామెడీ సింహ భాగం సొంతమైంది. సెకండాఫ్ లో ఒక సుదీర్ఘ ఎపిసోడ్ అంతా నవ్వించి నవ్వించి చంపుతారు. ఈ ఎపిసోడ్ లేకపోతే సెకండాఫ్ లో కూడా ఏమీ వుండేది కాడు సినిమాలో.   హీరోయిన్లు నామ్ కే వాస్తే వున్నారు. వాళ్ళతో సరయిన రోమాన్స్ కూడా లేదు నరేష్, సునీల్ లకి. దుష్టపాత్రల్లో పోసానీ, రాజా రవీంద్రలు వాళ్ళ అనుభవాన్ని మరోసారి ప్రదర్శించుకున్నారు.  

          ఇక సంగీత సాహిత్యాలు, ఛాయాగ్రహణాలు. ఇతర సాంకేతిక విలువలూ లో గ్రేడ్ గా వున్నాయి. దర్శకత్వం పాత స్కూల్లో వుంది.  దర్శకుడే రాసుకున్న సంభాషణలు సినిమాటిక్ గానే వున్నాయి. జయప్రకాష్ రెడ్డి ఎపిసోడ్ లో మాత్రమే కామెడీ డైలాగులు బాగా పేలాయి.

చివరికేమిటి 

          ఇది పాత కథే అయినా తమిళంలో కొత్త స్కూలు దర్శకుడి కామెడీ. యూత్ ఫుల్ గా తీశాడు. రాత, తీత రెండూ కొత్త పంథాలో ఇన్స్ పైరింగ్ గా వుంటాయి. యాభై కోట్లు వసూలు చేసింది కాబట్టే తెలుగుకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఈ కొత్త స్కూలు న్యూవేవ్ కామెడీ పాత స్కూలు దర్శకత్వంలోకి మారిపాయింది. దీని తమిళ, తెలుగు దర్శకత్వాల్లో తరాల అంతరం స్పష్టంగా కన్పిస్తుంది. తెలుగులో ఇంకెవరైనా యువదర్శకుడు తీసి వుంటే బాగా హేండిల్ చేసేవాడేమో. భీమనేని శ్రీనివాసరావు ఇప్పటి సినిమాలని రీమేక్ చేయాలంటే ముందు తను కొత్త స్కూలుకి మారాలి. ఇది సాధ్యమైనప్పుడు మాత్రమే ఆయనకి పూర్వపు హిట్లు వస్తాయి. సమకాలీనుల సినిమాలని రిమేక్ చేయడం వేరు, తరం మారిన మేకర్ల సినిమాలని రీమేక్ చేయడం వేరు. ప్రస్తుత ప్రయత్న ఫలితం ఆయనకి నిరాశే మిగల్చడం సహజం. ‘సిల్లీ ఫెలోస్’ అంతా వొక్క జేపీ కామెడీ ఎపిసోడ్ మాత్రమే అన్నట్టుగా తయారైంది. దీంతోనే సంతృప్తి పడాలి ప్రేక్షకులు.