సీనియర్ నటుల ఈగో సమస్య గురించి పరిశ్రమలో నిరంతరం చర్చ సాగుతుంటుంది. కొత్త తరం దర్శకులకు ముఖ్యంగా వీళ్లతో కొన్ని చిక్కులుంటాయి. ఏదైనా క్రమశిక్షణ విషయంలో కానీ లేదా ఇతరత్రా విషయాల్లో కానీ ప్రశ్నించడం కుదరదు. అలాంటి సమస్యల వల్లనే పలువురు సీనియర్ కమెడియన్లు.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గాయన్న ప్రచారం ఉంది.
అప్పట్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ `ఆగడు` సెట్ లో గొడవ గురించి తెలిసిందే. శ్రీనువైట్ల అసిస్టెంట్ తో ప్రకాష్ రాజ్ కి ఈగో సమస్య తలెత్తడంతో గొడవ పెద్దదై ఆయన సినిమా నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విలక్షణ నటుడి కెరీర్ చూస్తున్నదే. ఇటీవలే ఓ రెండు క్రేజీ ప్రాజెక్టుల నుంచి ఇద్దరు సీనియర్ నటులు తప్పుకోవడంపైనా ఫిలింనగర్ లో రకరకాలుగా గుసగుసలు వినిపించాయి. అప్పట్లో మహేష్ సినిమా `సరిలేరు నీకెవ్వరు` నుంచి జగపతి బాబు వైదొలిగారు. అతడు తప్పుకోవడానికి రకరకాల కారణాలున్నాయని ప్రచారమైంది. అయితే ఆ టీమ్ తో ఎలాంటి సమస్యా లేదని జగపతిబాబు మీడియాకి వివరణ ఇచ్చారు. అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అంటూ అనీల్ రావిపూడి సోషల్ మీడియాలో ప్రతిస్పందించారు. జగపతితో మళ్లీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నామని మహేష్ – అనీల్ రావిపూడి ప్రస్థావించారు. తాజాగా బన్ని నటిస్తున్న ఏఏ 19 సినిమా నుంచి సీనియర్ నటుడు రావు రమేష్ వాకౌట్ చేశారని ప్రచారమవుతోంది. కాల్షీట్ల సమస్య వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని చెబుతున్నారు. కానీ కారణం వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రావు రమేష్ కి ఏం చిక్కొచ్చింది? అంటే తన పాత్రను మలిచిన తీరు అతడికి నచ్చలేదన్న ప్రచారం ఉంది. అంత పెద్ద సినిమాకి కమిటయ్యాక ఏదోలా కాల్షీట్లు సర్ధుబాటు చేస్తారు కానీ.. అంతకుమించిన బలమైన కారణం ఉండి ఉంటుంది అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. పాత్ర తీరు తెన్నులు నచ్చకపోయినా తప్పుకునే వీలుంటుంది. లేదూ దర్శకుడితో పొసగకపోయినా తప్పుకోవాల్సిన సన్నివేశం ఉంటుంది. ముందు అనుకున్న ఆర్టిస్టుకు ఆ పాత్ర సూటవ్వలేదని భావించినా ఇబ్బంది తప్పదని, సీనియర్లతో దర్శకులకు ఎగ్జిస్టెన్సీ సమస్య ఉంటుందని ఓ సీనియర్ ఆర్టిస్టు అనుభవ పూర్వకంగా తెలిపారు. తమను సంతృప్తి పరిచే పాత్ర కాదని ఆర్టిస్టు అనుకున్నా వదులుకునే సందర్భాలుంటాయి. ఇదివరకూ కోట.. బ్రహ్మానందం.. కృష్ణ భగవాన్ లాంటి వాళ్లతోనే దర్శకులకు కొన్ని సమస్యలు ఎదురయ్యేవని వీళ్లను ఏదీ ప్రశ్నించలేరని ప్రచారం సాగింది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పైనా ఈ తరహా ప్రచారం ఉన్నా .. ఆయన ఇటీవల నవతరం దర్శకుల్ని కలుపుకుపోతూ వెంట వెంటనే ప్రాజెక్టులు కమిటవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ తరహా చొరవ సీనియర్ నరేష్ లోనూ ఉంటుందన్న టాక్ పరిశ్రమలో ఉంది.