ప్రముఖ సీనియర్ తమిళ నటుడు, గాయకుడు టీఎస్ రాఘవేంద్ర కన్నుమూశారు. కొంతకాలంగా వయో భారంతో బాధ పడుతున్న ఆయన బుధవారం రాత్రి మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కేకే నగర్‌లోని నివాసంలో ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా రాఘవేంద్ర మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక రాఘవేందర్‌గా సినీ ప్రేమికులకు సుపరిచితమైన ఆయనకు భార్య సులోచన, ఇద్దరు కూతుళ్లు కల్పన, షేకీనా శవాన్(ప్రసన్న) ఉన్నారు. వీరు ముగ్గురు కూడా గాయనీమణులే కావడం విశేషం.
కాగా నటి సుహాసినికి పలు అవార్డులు తెచ్చిపెట్టిన సింధు భైరవి సినిమాలో.. రాఘవేంద్ర ఆమెకు తండ్రిగా నటించారు. అదే విధంగా రేవతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వైదేహి కాత్రిరుందల్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. విక్రం, హరిశ్చంద్ర, నీ వేరువై ఎన తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన నటించిన చివరి చిత్రం పోన్ మేఘాలై 2005లో విడుదలైంది. నటుడిగానే కాకుండా గాయకుడిగా, స్వరకర్తగా రాఘవేంద్ర గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.