తీన్మార్ కు గుడ్ బై చెప్పిన సావిత్రి ?

తీన్మార్ కు గుడ్ బై చెప్పిన సావిత్రి ?

వి 6 ఛానల్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపేరు తీన్మార్ సావిత్రి . ఈ ఛానల్ లో సావిత్రి , బిత్తిరి సత్తి చేసే హడావిడి, హాస్యం , వ్యంగ్యం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంటాయి . తీన్మార్ వార్తలు అనగానే చాలా మంది ఇష్టపడతారు . సమకాలీన సమాజంలో జరిగే మంచి చెడుల సమాహారంగా ఈ వార్తలను వండి వేడి వేడి గా వడ్డిస్తుంటారు . నిజానికి సావిత్రి అసలు పేరు శివ జ్యోతి . కానీ తీన్మార్ సావిత్రి అంటేనే అందరికీ తెలుసు. ఈ సావిత్రి అదే శివ జ్యోతి ఇప్పుడు బిగ్ బాస్ 3 లో ఎన్నికై షో లో పాల్గొంటున్నది .

హీరో నాగార్జున హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 3లో పరిచయం చేసిన మొదటి లిస్టు లో సావిత్రి వుంది . అయితే ఈమెను తీన్మార్ సావిత్రిగా గా పరిచయం చెయ్యవద్దని వి 6 బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసు ఇచ్చింది . సావిత్రి బిగ్ బాస్ షో లో పాల్గొనే విషయాన్ని వి 6 సంస్థ సీరియస్ గా తీసుకుంది. టివీ షోలకు, బయట యాంకరింగ్ లకు తీన్మార్ సావిత్రి, బిత్తిరి సత్తి, అంతకు ముందు మరి కొందరు అడిగితే వి6 అనుమతి ఇచ్చింది .

బిత్తిరి సత్తి తీన్మార్ కాకుండా ఇతర టీవీ షోలు నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతగా వున్నాడు అంతేకాదు సినిమాలలో కూడా నటిస్తున్నాడు . అందుకే సావిత్రి వి 6 వారి అనుమతి తీసుకోకుండానే బిగ్ బాస్ షోలో పాల్గొన్నది . ఎప్పుడయితే వి 6యాజమాన్యం పేచీ పెట్టిందో అప్పుడు సావిత్రి అదే శివ జ్యోతి తీన్మార్ కొలువు వద్దంటూ చెప్పేసింది .

కాపీరైట్ చట్టాల పరిధి, పరిమితి తెలిసిన బిగ్ బాస్ నిర్వాహకులు వి6 సంస్థ పేరిట సర్వ హక్కులు ఉన్న తీన్మార్ క్యారెక్టర్స్ లో ఒకటైన సావిత్రి పేరు వాడి న్యాయపరమైన చిక్కులు వద్దనుకున్నారు . అసలే ఈ షో పై ఇప్పటికే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి . అందుకే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా తీన్మార్ సావిత్రిగా కాకుండా శివ జ్యోతిగా పరిచయం చేశారు . బిగ్ బాస్ 3 షో కోసం శివ జ్యోతి తీన్మార్ షో ను వదులుకుంది .