కశ్మీర్ ట్రైన్ హైదరాబాద్ వరకూ
మహేష్- అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు
సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను
బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ .. ఎఫ్ 2
సంచలన విజయం తర్వాత అనీల్ రావిపూడి ఎంతో జోష్ లో ఈ ప్రాజెక్టుకి కమిటయ్యారు. రష్మిక మందన ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ – శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనీల్ సుంకర, దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రారంభోత్సవంలోనే ప్రకటించారు.
అందుకు తగ్గట్టే సరిలేరు నీకెవ్వరు
శరవేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. కశ్మీర్ లో షెడ్యూల్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ షెడ్యూల్ కి టీమ్ రెడీ అవుతోంది. ఈనెల 26 నుంచి రాజధానిలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తామని దర్శకుడు అనీల్ రావిపూడి ఈ సందర్భంగా వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ తో కలిసి పని చేయడం గొప్ప అనుభవాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. రెండో షెడ్యూల్ ప్రారంభించేందుకు ఉత్కంఠగా వేచి చూస్తున్నానని అనీల్ రావిపూడి తెలిపారు.
కశ్మీర్ నుంచి హైదరాబాద్ కి ప్రయాణించే ట్రైన్ లో ఆర్మీ మేజర్ మహేష్ – రష్మిక ఇతర తారాగణానికి మధ్య కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ట్రైన్ సెట్ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెట్ లోనే రెండో షెడ్యూల్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ విజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. మహేష్ ఆర్మీ గెటప్ ఫోటోలు ఇప్పటికే లీకైన సంగతి తెలిసిందే. అతడి పాత్ర పేరును అనీల్ రావిపూడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. 2020 సంక్రాంతి బరిలో హిలేరియస్ కామెడీ ట్రీటిచ్చే సినిమా ఇదేనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.