ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా తెలుగుతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఈ మల్టీ స్టారర్ మూవీకి అన్ని భాషలలో ఆర్ఆర్ఆర్ ని వర్కింగ్ టైటిల్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇప్పటివరకు ఖరారు కాలేదు.
`ఆర్ఆర్ఆర్`కు సరిగ్గా సరిపోయే ఎబ్రివేషన్‌ను పంపించాల్సిందిగా దర్శకుడు రాజమౌళి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ భాషలకు చెందిన అభిమానులు `ఆర్ఆర్ఆర్`కు సరిపోయే విధంగా తమకు తోచిన ఎబ్రివేషన్‌లను పంపిస్తున్నారు. `రఘుపతి రాఘవ రాజారాం`, `రాజ్యం రణం రక్తం`, `రాముడు రుద్రుడు రణరంగం`, `రామ రాజ్య రక్షక`.. ఇలా ఇప్పటికే ఎంతో మంది పంపించిన వాటిని `ఆర్ఆర్ఆర్` యూనిట్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Expansions for #RRR kept pouring in from all sides in all languages, since the day we asked you to come up with the Title. Some are powerful. Some are intense. Some are thoughtful. We loved some of them! Keep sending them in. Who knows, your title could be the actual #RRRTitle! pic.twitter.com/wEysmEKoqs
— RRR Movie (@RRRMovie) May 1, 2019
`అన్ని భాషల నుంచి `ఆర్ఆర్ఆర్`కు సంబంధించిన ఎబ్రివేషన్స్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కొన్ని పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. కొన్ని భావయుక్తంగా ఉన్నాయి. కొన్ని ఆలోచింపజేసివిగా ఉన్నాయి. ఇంకా పంపించండి. ఎవరికి తెలుసు.. మీరు పంపించేదే `ఆర్ఆర్ఆర్` అసలు టైటిల్ అవుతుందేమోన`ని చిత్రయూనిట్ ట్వీట్ చేసింది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీయార్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. చెర్రీ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటీమణి ఆలియా భట్‌ను తీసుకున్నారు. ఎన్టీయార్ సరసన హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం చరణ్ షూటింగ్‌లో గాయపడడం వలన షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ పడింది. మరి కొద్ది రోజులలో చిత్రానికి సంబంధించిన యాక్షన్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోని కోకాపేటలో జరపనున్నారు. ఆ తర్వాత పూణేకి ప్రయాణం కట్టనుంది చిత్ర యూనిట్.