ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ . అయితే ఆర్ ఆర్ ఆర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ అనే సంగతి అందరికి తెలుసు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఏ టైటిల్ పెడితే బాగుంటుందనే డిబేట్ లాంటిది మొదలెట్టింది ఆర్ ఆర్ ఆర్ టీమ్. తమ సినిమాకు మంచి టైటిల్ చెబితే, దాన్నే పెట్టేందుకు ఆలోచిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించిన కథ అందరికీ తెలుసునని, దాన్ని ఆధారంగా ‘ఆర్ఆర్ఆర్’ అంటే అబ్రివేషన్ చెప్పాలని డీవీవీ ఎంటర్ టెయిన్ మెంట్స్ కోరింది. అభిమానులు తమ సొంత అబ్రివేషన్స్ తో రావాలని, వాటిని రాజమౌళి స్వయంగా పరిశీలిస్తారని వెల్లడించింది. అభిమానులు తమ టైటిల్స్ ను ట్వీట్ చేయాలని సూచించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపట్లోనే ఓ వెల్లువలా ట్విట్ లు పడుతున్నాయి. ఈ విషయాన్ని ఆ చిత్రం పీఆర్వో ట్వీట్ చేసి తెలిపారు.
Already receiving lots of abbreviations for our title #RRR in different languages. Keep them coming with #RRRTitle. pic.twitter.com/WBSbhpRStQ
— Vamsi Kaka (@vamsikaka) March 18, 2019
ఇక మొన్న ప్రెస్ మీట్ జరిగిన రోజు రాజమౌళి చిత్రం కథకు సంభందించి కీలక విషయాలను వెల్లడించారు. సినిమా కథా కథనాలు, నటీనటులు వివరాలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కుసంబంధించి కూడా కామెంట్స్ చేశారు. అలియా భట్.. సీతగా కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో కనిపించనుందన్నారు. అదే సమయంలో అజయ్ దేవగన్ చేయబోయేది విలన్ పాత్ర కాదని క్లారిటీ ఇచ్చారు.
అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం పోరాట యోధులుగా మారటానికి ముందు కొంత కాలం ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో వారు ఎక్కడున్నారు, యోధులుగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్నట్టుగా తెలిపారు.
కథ గురించి రాజమౌళి మాట్లాడుతూ..‘‘1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఆంగ్లమే కాకుండా వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడు సంవత్సరాలు పాటు ఇంటిపట్టున లేరు. తిరిగొచ్చాక ఆయన స్వతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మనకు తెలిసిందే.
1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయనకు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక చదువకుని వచ్చారు. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమురం భీం పోరాడారు. వాళ్ల చరిత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే మేం సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింది.’’ అన్నారు.