RRR బ్యూటీకి మ‌రో రెండు పాన్ ఇండియా ఆఫ‌ర్లు

ల‌క్కు చిక్కి రొట్టె నెయ్యిలో ప‌డ‌డం అంటే ఇదే. ఓవైపు వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉంది. మ‌రోవైపు వ‌రుస‌గా పాన్ ఇండియా అవ‌కాశాలు త‌న‌నే వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ఇండ‌స్ట్రీలో ఎంద‌రో టాప్ హీరోయిన్లు ఉన్నా ఈ కుర్ర‌బ్యూటీనే వెతుక్కుంటూ వెళుతున్నారు మ‌న ద‌ర్శ‌కులు. ఇంత‌కీ ఎవ‌రా బ్యూటీ? అంటే చెప్పాల్సిన ప‌నే లేదు. ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా గురించే.

ఈ అమ్మ‌డు ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ స‌హా బ్ర‌హ్మాస్త్ర లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీక‌ర‌ణ కోసం వేచి చూస్తోంది. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలియా న‌టిస్తున్న సంగ‌తి విధిత‌మే. ఈలోగానే టాలీవుడ్ లో మ‌రో రెండు పాన్ ఇండియా చిత్రాల్లో న‌టించే అవ‌కాశం ఈ అమ్మ‌డిని వ‌రించాయ‌ని స‌మాచారం అందుతోంది.

అలియా భట్ మరో రెండు పాన్-ఇండియా ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతోంది. ప్రభాస్- నాగ్ అశ్విన్ చిత్రంలో అలాగే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో క‌థానాయిక‌గా ఛాన్స్ ద‌క్కించుకుంద‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే జాక్ పాట్ ప‌ట్టేసిన‌ట్టే. 250 కోట్లు అంత‌కుమించిన భారీ బ‌డ్జెట్లు వెచ్చించే సినిమాల్లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్న ఏకైక అమ్మ‌డు ఆలియానే.