రజనీకాంత్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘రోబో 2.0’ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేస్తామని దర్శకుడు శంకర్ ఇది వరకే ప్రకటించారు కానీ …. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ కార్యక్రమాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు కాబట్టి కాస్త లేటు అయ్యేటట్లు ఉందని న్యూస్. ఈలోగా జనాలు ఈ ప్రాజెక్టుపై నుంచి దృష్టి మరల్చకుండా ఉండేటట్లు ప్రచార కార్యక్రమాలకూ ఉదృతం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇప్పటివరకు ‘రోబో 2.0’కి సంబంధించిన మేకింగ్ వీడియోలు, టీజర్ మినహాయిస్తే…ట్రైలర్ బయటకు రాలేదు. దాంతో ఈ దీపావళికి ఓ ట్రైలర్ ని విడుదల చేయాలని శంకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ రోజు నుంచి క్రమంగా ప్రచార కార్యక్రమాల జోరు పెంచాలని భావిస్తున్నారు.
ఇక రోబో 2పాయింట్ ఓ టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. విజువల్ వండర్ గా ఉందని టాక్ రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే టీజర్ లో రజినీకాంత్ పైనేఎక్కువ దృష్టి సారించి అక్షయ్ కుమార్ గురించి పెద్దగా చూపించకపోవడంతో బాలీవుడ్ నుంచి విమర్శలు వచ్చాయి. అక్షయ్ కుమార్ కు సంబంధించి ప్రత్యేకంగా టీజర్ ను రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.
నవంబర్ 7 న విడుదల కాబోయే టీజర్లో ఎక్కువభాగం అక్షయ్ కుమార్ గురించి చూపించబోతున్నారని తెలుస్తోంది. అక్షయ్ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా చూపిస్తారని సమాచారం.
‘రోబో’ ఆడియో విడుదల, టీజర్ విడుదల వినూత్నంగా సాగాయి. ఇప్పుడు అంతకంటే వైవిధ్యంగా ‘రోబో 2.0’ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 3డి, 2డిలలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.