పర్వదినాల్లో ఎవరైనా దేవాలయాలకు వెళ్లటం వింతేమీ కాదు. అయితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెళ్లటం మాత్రం వింతే. ఎందుకంటే పండుగపూట ఆయన దేవుడు గుళ్లో కనిపించి షాక్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు.
హేతువాద దృక్పథంతో తనదైన విలక్షణతతో హిందూ దేవతలపై కామెంట్స్, విమర్శలు చేస్తూ వివాదాల్లో కనిపించే వర్మ దైవదర్శనం చేసుకొని ఆయన ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేశారు. కుటుంబ సభ్యులు, కొంతమంది బంధువులతో కలిసి ఆయన చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు పూలమాలలు వేసి ఆహ్వానం పలకగా.. వర్మ పూజలు చేశారు.
వేదపండితులు మంత్రోచ్ఛరణలతో వర్మ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు వినాయకుడి ఫొటో, ప్రసాదం అందజేశారు. అనంతరం సాధారణ భక్తుల తరహాలోనే ఆలయంలో కలియతిరుగుతూ వర్మ దైవదర్శనం చేసుకున్నారు. ఇదంతా చూసి భగవంతుడే షాక్ అయ్యి ఉంటాడని నెట్ జనలు వ్యాఖ్యానం చేస్తున్నారు.