ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో సాహో షో

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్‌ గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది.ఇప్పటికే సౌత్‌ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్‌, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. అద్భుతమైన ఇంటీరియర్‌లో అత్యాధునిక సదుపాయాలున్న ఈ థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు అవకాశం దక్కటం గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్‌ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు.యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో సినిమా ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు సుజిత్‌ దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది.