ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’రిలీజ్ కు డేట్ ఇచ్చేసారు

సినిమా ప్రారంభం రోజు నుంచే వివాదాస్పదమైన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పి షాక్ ఇచ్చింది. దాంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది.

అయితే ఇప్పుడు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో ఏపీ మినహా అన్ని చోట్లా విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విడుదలను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను ఆపారు.

కాగా ఇప్పుడు మే 1న సినిమాను ఏపీలో విడుదల చేయబోతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు వర్మ తెలిపారు. కన్నడ నటి యజ్ఞ శెట్టి ఇందులో లక్ష్మీ పార్వతి పాత్రను పోషించారు. ఎన్టీఆర్‌గా రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటించారు. అగస్త్య మంజుతో కలిసి వర్మ డైరెక్ట్‌ చేస్తున్న ఈసినిమాకు రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మాతలు.