కాలు విరిగింది…మూడు ఆపరేషన్స్: రమ్యకృష్ణ

కంగారుపడకండి..రమ్యకృష్ణకు ఈ సంఘటన జరిగింది ఇప్పుడు కాదు..ఆమె కెరీర్ ప్రారంభంలో . ఈ విషయాలను తాజాగా ఆమె గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడింది.

రమ్యకృష్ణ మాట్లాడుతూ…‘నాకు అప్పుడు 17 ఏళ్లు. ఆ వయసులో ఓ సినిమా సెట్‌లో నా కుడి కాలి మడమకు గాయమైంది. అప్పుడు నేను రాత్రి, పగలు అనే తేడా లేకుండా మూడు సినిమా షూటింగ్‌లలో పాల్గొన్నా. ‘ముతల్‌ వసంతం’, ‘విళంగు’, ‘సంకీర్తన’ (నాగార్జున హీరో) చిత్రాల్లో నటించా. ‘ముతల్‌ వసంతం’ సెట్‌లో కాస్త గ్యాప్ దొరికితే బాగుండు అనుకుంటూ.. ఓ గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశా. మెట్లపై అడుగు వేశా.

అయితే అది కేవలం సెట్ అని, మెట్ల రూపంలో ఉన్న వస్త్రం అని తర్వాత అర్థమైంది. కాలు దానిపై పెట్టిన వెంటనే 15 అడుగులు కింద ఉన్న ఫ్లోర్‌పై పడ్డా. కాలి మడమ విరిగింది’ అంటూ ఆనాటి సంఘటన గుర్తు చేసుకున్నారు..

‘అప్పుడు ‘ముతల్‌ వసంతం’ సినిమా నటుడు అరుణ్‌ పాండియన్‌ (ఇప్పటి అన్నాడీఎంకే ఎమ్మెల్యే) ముందుకొచ్చి నన్ను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తనకు తెలిసిన వైద్యుల దగ్గర నాకు చికిత్స చేయించారు. తర్వాత సెట్‌కు చేతి కర్రల సహాయంతో వెళ్లా. అప్పుడు నేను ‘ఆరుం అధు ఆశం ఇల్లా..’ అనే పాట షూటింగ్‌లో పాల్గొన్నా. ఆ పాటను మీరు గమనిస్తే అందులో కేవలం నిల్చునే ఉంటాను. అటు, ఇటు కదలను. ఈ పాట షూట్‌ బీచ్‌లో జరిగింది.

కాలికి గాయమైనా అలానే నిల్చున్నా. షూట్‌ మధ్యలో గాయానికి మందులు రాస్తూ ఉన్నారు. అలా షూట్‌ కొనసాగించగలిగా. ఇంటికి వచ్చిన తర్వాత నొప్పితో తెగ ఏడ్చా. ఆ గాయం వల్ల ఏడాదిలో మూడు ఆపరేషన్స్ చేయించుకోవాల్సి వచ్చింది. స్టీల్‌ రాడ్లు పెట్టి, అతికించారు. ‘సంకీర్తన’ సినిమాలో మూడు పాటలకు క్లాసికల్‌ డ్యాన్స్‌ చేయాల్సి ఉంది. 1984 నాకు అతి కష్టమైన ఏడాది, నా సినీ కెరీర్‌ ప్రమాదంలో పడబోయింది. ఆ గాయం వల్ల రెండు సినిమాలు కోల్పోయా’ అంటూ గుర్తు చేసుకున్నారు.