‘ఆర్ ఆర్ ఆర్’ (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన వివరాలను ఎట్టకేలకు ఎస్.ఎస్ రాజమౌళి గురువారం ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ల, నిర్మాత దానయ్య కూడా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను వారు వివరించారు. రామ్ చరణ్ ఈ ప్రెస్ మీట్ లో ఏమన్నారో చూద్దాం.
రామ్ చరణ్ మాట్లాడుతూ…‘‘ఇది నిజంగా జరుగుతోందా లేదా అన్నది కూడా ఇంకా నమ్మలేకపోతున్నాను. రాజమౌళితో మళ్లీ పనిచేయాలనుకున్నాం. కానీ తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు. ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైందనేది నా ఆసక్తి. ఒకరోజు ఊరువెళ్తున్నప్పుడు ఆయన ఇంటికి రమ్మన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లగానే ఒక మంచి పోజ్‌లో తారక్ కింద నేల మీద రిలాక్స్ అయి కూర్చున్నారు. తారక్‌కు నేనొస్తానని తెలీదు. నాకూ తనొస్తాడని తెలీదు. అలా ఇద్దరం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం.
మా ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్లి ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి చెప్పారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇద్దరం ఆయన్ను కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పాం. ఆ తర్వాత తీసిన ఫొటోనే మీరు చూశారు. అద్బుతమైన, గౌరవప్రధానమైన పాత్రల్లో నటిస్తున్నాం. మేం కూడా చాలా జాగ్రత్తగా నటిస్తున్నాం. నా సోదరుడు తారక్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇంకా మా పాత్రలకు సంబంధించిన షూటింగ్ మొదలుకాలేదు.’’అని చెప్పుకొచ్చారు.