కర్ర విరక్కుండా… శబరిమల ఇష్యూపై  రజనీ కామెంట్

రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి  అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన విషయాలైన శబరిమల, మీటూ ఉద్యమ విషయాలపై ఆయన స్పందన …కర్ర విరక్కుండా..పాము చావకుండా అన్నట్లుగా రెండు విధాలుగా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో నెట్ జనులు వెల్లబుచ్చుతున్నారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే… శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

రజనీకాంత్ తాను నటిస్తున్న ‘పేట్టా’ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ లక్నో నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ మీడియాని కలిసి ప్రశ్నించింది.

దాంతో మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు అవసరం లేదన్నారు. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచారం ఏళ్లుగా ఉంటోందని, ఇది నమ్మకానికి సంబంధించిన వ్యవహారమన్నారు. ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు.

అదే సమయంలో .. మీటూ వివాదంపైనా రజనీకాంత్ స్పందిస్తూ…‘మీటూ’ ఉద్యమంతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. అయితే దీన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. సరైన రీతిలో మీటూను బాధిత మహిళలు వినియోగించుకోవాలన్నారు.