రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్టు

రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ చెబుతున్నవి అబద్ధాలని.. తాగి కారు నడిపి ప్రమాదం చేశాడని ఓ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ప్రమాదం జరిగిన రోజు రాజ్ తరుణ్ మందు తాగాడని.. అతన్ని తాను ప్రశ్నిస్తే మందు తాగిన విషయం అంగీకరించాడని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను తన ఇంటి బాల్కనీలో ఉన్నానని. తాను చూసిన వెంటనే వీడియో తీశానన్నాడు. 120 – 140 కిమీ.ల వేగంతో కారు వచ్చి ఢీకొందని చెప్పాడు. వెంటనే కారు దిగిన రాజ్ తరుణ్.. అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించాడన్నాడు. తనకు మొదట ఏం జరిగిందో అర్థం కాక.. ఇంటి నుంచి కిందకు వచ్చి.. అతన్ని వెంబడించానని తెలిపాడు. తాను యాక్సిడెంట్ చేయలేదని.. దమ్ము కోసం వచ్చానన్నాడని.. చివరికి విజువల్స్ చూపించగా ఒప్పుకున్నాడని చెప్పాడు. తర్వాత తన మేనేజర్ రాజా రవీంద్ర మాట్లాడతారంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడన్నారు.తర్వాత సీన్‌లోకి వచ్చిన రాజారవీంద్ర.. ఆ విజువల్స్ డిలీట్ చేస్తే రూ.5 లక్షలు ఇవ్వజూపారని.. దానికి సంబంధించిన ఆడియో రుజువులు కూడా తన దగ్గరున్నాయన్నాడు. మొత్తం రూ. 3లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టు నటించానని.. ఇంతలో ఓ మహిళ తనను నానా దుర్భాషలాడిందని ఆరోపించాడు. యాక్సిడెంట్ జరిగిన 24 గంటలు కనిపించకుండా ఉన్న రాజ్ తరుణ్.. ఇప్పుడు నీతులు చెబుతున్నాడని మండిపడ్డాడు.
అతని నిజస్వరూపం బయటపెట్టడానికే ఇదంతా చేశానన్నాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టిద్దామనుకున్నానని కానీ కుదరలేదని చెప్పాడు.

రాజ్ తరుణ్ కారు.. నార్సింగి దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 24 గంటలు అజ్ఞాతంలో ఉన్న ఆయన. తనకు జరిగిన ప్రమాదంపై వివరణ ఇస్తూ.ఓ వీడియో విడుదల చేశారు.