షూటింగ్ కోసం అడవుల్లో రోడ్లు వేస్తున్నారట
సుకుమార్ ఇంతకుముందు గోదావరి పరిసరాల్లో మత్స్యకారుల విలేజీల్లో రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించి ఔరా అనిపించాడు. అక్కడ పల్లె పట్టు సౌందర్యాన్ని ఎంతో అందంగా విజువలైజ్ చేసారు లెక్కల మాస్టారు! అన్న ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరోసారి గోదారినే సుక్కూ నమ్ముకున్నారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. ఆ క్రమంలోనే అసలు షూటింగ్ ఉంటుందా ఉండదా? అంటూ అందరిలో ఒకటే డైలమా. బన్ని అభిమానులు అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక అన్నిటికీ చెక్ పెట్టేసేందుకు సుక్కూ లొకేషన్లను ఫైనల్ చేసి పుష్ప షెడ్యూల్ ని పరుగులెత్తించే ఆలోచనలో ఉన్నారట.
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్స్ వేయడమేగాక.. అటు గోదవారి పరిసరాల్లోనూ సెట్లు వేస్తున్నారట. దీంతో పాటే గోదవారి నది పరీవాహంలో రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలోని ఏజెన్సీ ఏరియాల్లోనూ పుష్ప షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ముఖ్యంగా అక్కడ ప్రకృతికి నెలవు అయిన మారేడుమిల్లి ఏరియాలో షూటింగ్ చేయాలన్నది సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్. ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో రోడ్లకు మరమ్మతులు చేసి తమకు అనువుగా మలుచుకుంటున్నారట. అయితే ఇలా షూటింగ్ కోసం రోడ్లు వేయడం అంటే ఆసక్తికరమే.
ఒక మంచి పని చేస్తున్నట్టే లెక్క. అడవులు ఏజెన్సీ ప్రాంతాలు అంటే రోడ్లు అనుకూలంగా ఉండవు. పైగా వర్షాల సీజన్ లో కొట్టుకుపోతుంటాయి. అక్కడ తమకు కావాల్సిన విధంగా ఉండాలంటే ఇలా మరమ్మతులు చేసుకోవాల్సిందేనని విశ్లేషిస్తున్నారు.
ఇక మారేడుమిల్లి కొండ కోనలు జలపాతాలు నదీ ప్రాంతం అదంతా ఒక నందనవనం అనే చెప్పాలి. తూ.గో జిల్లాలోనే అత్యంత అందమైన ప్రదేశం ఇది. ఇలాంటి చోట షూటింగ్ అంటే పుష్ప ఎంతో ప్రకృతి రమణీయతతో అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.