చిరంజీవి నట జీవితానికి అదే “పునాది రాళ్లు”

సినిమా హీరో కావాలని చాలామంది కలలుకంటారు. అయితే ఆ కలల్ని సాకారం చేకునేవారు కొందరే. అందుకు కృషి, పట్టుదలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలంటారు. కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, అందుకు ప్రోత్సాహం కూడా లభించాలి . 

చిరంజీవి అనే నటుడు సినిమా రంగంలో ఎవరి అండ లేకుండా పైకి వచ్చి మెగా స్టార్ అయ్యాడు అంటే అది కేవలం అదృష్టం అనలేము, ప్రోత్సాహం లేకుండా నటుడుగా స్థిరపడ్డాడని కూడా చెప్పలేము.

చిరంజీవి “పునాది రాళ్లు ” అనే సినిమాతో నటుడయ్యాడు. దర్శకుడు రాజ్ కుమార్ గూడపాటి  చిరంజీవిని పునాది రాళ్లు సినిమాకు ఎంపిక చేసుకున్నాడు.

అసలు చిరంజీవి ఈ సినిమా లో హీరోగా ఎలా నటించాడు? ఎవరివల్ల అవకాశం వచ్చింది? అనే ప్రశ్నలకు చిరంజీవి చెప్పిన సమాధానం.

హైదరాబాద్ భాగ్యనగర్ స్టూడియోలో ఓ చిత్రం షూటింగ్ కోసం వచ్చినప్పడు చిరంజీవి తన మొదటి సినిమా అనుభవాలను నాతో పంచుకున్నారు.

ఇది 1979 నాటి  సంగతి. అంటే దాదాపు 40 సంవత్సరాలనాటి అరుదైన కధనం.

“నాకు మొదటి నుంచి నటుడు కావాలనే కోరిక బాగా ఉండేది. నా మనసులోని కోరికను నాన్నతో చెబితే ఆయన ఒప్పుకున్నారు. ఆయన అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు, కానీ తృప్తి అనేది లేదు, అందుకే ఆయన కలలను నా ద్వారా  సార్ధకం చేసుకోలను కున్నాడేమో,వెంటనే ఒప్పుకున్నాడు. నేను మద్రాసులోని అడయార్ ఫిలిం  ఇనిస్టిట్యూట్ లో చేరాను. నిజానికి నా కోర్సు 1978 జూన్ తో పూర్తి అవుతుంది. అయితే గూడపాటి రాజ్ కుమార్ నన్ను కలసి  తన దర్శకత్వంలో వస్తున్న”పునాది రాళ్లు”సినిమాలో వేషం వెయ్యమని అడిగాడ . శిక్షణ పూర్తికాకుండా ఎలా నటించడం?

సినిమాలో అవకాశం వచ్చింది అనుమతి ఇవ్వమంటే ప్రిన్సిపాల్ ఇవ్వడు. ప్రిన్సిపాల్ కు తెలియకుండా నటించలేను. వచ్చిన అవకాశం పోగొట్టుకోవం ఇష్టం లేదు ఎలా? ఏమి చెయ్యాలి? మానసికంగా నలిగిపొయ్యాను.

ఏమి చెయ్యాలో తెలియడం లేదు. వచ్చిన అవకాశాన్ని చేతులారా పోకొట్టు కుంటే, మళ్ళీ అవకాశం వస్తుందా? బాగా ఆలోచించాను.

ఉదయమే ఇన్స్టిట్యూట్ కు వచ్చిన వెంటనే ప్రిన్సిపాల్ కు నా నిర్ణయం చెప్పాను. మొదట ఆయన కోప్పడ్డాడు, ఆ తరువాత ఆలోచించి సరే అన్నాడు.

అప్పటి నా ఆనందం ఏమని వర్ణించను?

మళ్ళీ ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే “చిరంజీవి రెండు నెలలు సెలవు పెట్టు. అది ఇద్దరికీ మంచింది అని సలహా ఇచ్చాడు. నాకు అదే సరైన పద్దతి అనిపించింది.

అలా నేను “పునాది రాళ్లు”  సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. నా నట జీవితానికి అదే “పునాది రాళ్లు”  వేసింది.

నేను మేకప్ వేసుకొని తొలి డైలాగ్  చెప్పిన రోజు ఫిబ్రవరి 11, 1978. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను.

విశేషం నా మొదటి సినిమా విడుదలకు ముందే కె. వాసు దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన “ప్రాణం ఖరీదు”, జయకృష్ణ తీసిన “మనవూరి పాండవులు” చిత్రాలు విడుదలయ్యాయి.

ఇక నా మొదటి సినిమా పునాది రాళ్లు జూన్ 21 ,1979లో విడుదలయ్యింది.

ఏమైనా ఆరోజు నేను ఆ నిర్ణయం తీసుకోవం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ ఒప్పుకోవడం అన్నీ శుభ శుభ సూచనలే. ” అని తన మొదటి సినిమా అనుభవం చెప్పాడు చిరంజీవి.

-భగీరథ